Revanth Reddy Arrest : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారికి రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో సమావేశం అయ్యేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసుల కళ్లుగప్పి బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోకి రేవంత్ రెడ్డి వెళ్లారు. ట్రిపుల్ ఐటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు, రేవంత్ రెడ్డిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసు వాహనంలో బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి నవిపెట్ వైపుగా తీసుకెళ్లారు. 


నాలుగో రోజూ ఆందోళనలు 


బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన నాలుగో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల విషయంలో విద్యార్థులు పట్టువీడడంలేదు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థుల ఆందోళనల కారణంగా క్యాంపస్ గేటు వద్ద పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎవరినీ క్యాంపస్ లోపలికి వెళ్లనివ్వడంలేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులను అడ్డుకుంటున్నారు. నిజామాబాద్-భైంసా రహదారుల్లో పోలీస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 


స్పందించిన రాహుల్ గాంధీ


బాసర విద్యార్థుల ఆందోళనపై రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో బాసర ట్రిపుల్ ఐటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయలుదేరారు. అయితే ఆయనను విద్యార్థులతో కలవకుండానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాసర క్యాంపస్‌లో నీళ్లు, కరెంట్ నిలిపివేయడం రాక్షసత్వమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.  మంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు.


బండి సంజయ్ అరెస్టు


త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వారికి మద్దతు తెలపడానికి వెళ్తోన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ ను కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. బండి సంజయ్ కు ఘనస్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు అరగంట పాటు బండి సంజయ్ ను కారులోనే ఉంచి పోలీసులు ట్రిపుల్ ఐటీకి వెళ్లొద్దు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ ఐటీకి వెళ్తానని బండి సంజయ్ తెలపడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిక్కనూరు పోలీస్ స్టేషన్లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోంది. ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసిన సిల్లి సీఎం ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయలేని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని అన్నారు సంజయ్. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా, టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్.