Bandi Sanjay on TDP: తెలుగు దేశం పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అవన్నీ గాలి వార్తలేనని తెలిపారు. అలాంటి వార్తలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ఆదివారం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే మహాజరన్ సంపర్స్ అభియాన్ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. గడప గడపకూ బీజేపీ పేరుతో.. మోదీ సర్కారు అందించిన అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగామ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్ కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజాం బీజేపీది కాదని అన్నారు. 


బీజేపీని దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని బండి సంజయ్ చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్ట్ పార్టీలు అంతా ఏకమై  పోటీ చేయనున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పాలన పట్ల విసుగు చెందారని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామని.. కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని అన్నారు.  


శనివారం అమిత్ షాను కలిసిన చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులపాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో మొదలైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించారు.


ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కావడంతో పొత్తుల విషయంపై చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారని ఏపీలో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చే ఉండటంతో ఎన్డీఏలోకి కొత్త పార్టీలను ఆహ్వానించడంతో పాటు పాత మిత్రులను తమతో కలిసిరావాలని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ పలుమార్లు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రం పెద్దలను కలుస్తుంటారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు, విభజన సమస్యలు, రాజధాని, పోలవరం లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో పలుమార్లు ఢిల్లీలో భేటీ అయి జగన్ చర్చించారు. కానీ అధికారంలో లేని చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొలిటికల్ అజెండా కోసమేనని ప్రచారం జరుగుతోంది.