WTC Final 2023: రెండేండ్లకోమారు  ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఈనెల 7 నుంచి 11 దాకా  ఇంగ్లాండ్‌లోని ‘ఓవల్’ మైదానం వేదికగా జరుగనుంది.  ఈ మ్యాచ్ కోసం భారత్ - ఆస్ట్రేలియాలు ఇదివరకే లండన్‌కు చేరుకుని ప్రాక్టీస్ కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. అయితే  ఓవల్‌ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ ఎవరు..? ప్రస్తుత టీమిండియా నుంచి  ఓవల్‌లో మెరుగ్గా ఆడినవారు ఎవరైనా ఉన్నారా..? 


ఓవల్‌లో  అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్  ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్.  మిస్టర్ డిపెండెబుల్.. ఓవల్‌లో  మూడు టెస్టులు ఆడి  443 పరుగులు చేశాడు.  ఇక్కడ ద్రావిడ్ సగటు  110.75 గా ఉంది.   ద్రావిడ్ విషయం పక్కనబెడితే ప్రస్తుత తరంలో ఓవల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్  కెఎల్ రాహుల్. రాహుల్ ఇక్కడ  రెండు మ్యాచ్‌లలో  249 పరుగులు చేయగా రిషభ్ పంత్.. రెండు టెస్టులలో 178 పరుగులు సాధించాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయాల కారణంగా ఈ ఇద్దరూ  ఇప్పుడు  డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం లేదు. 


రాహుల్, పంత్ కాకుండా  ఓవల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ - 3 లో ఉన్నది రవీంద్ర జడేజా,  టీమిండియా సారథి రోహిత్ శర్మ, రన్ మిషీన్ విరాట్ కోహ్లీ. 


జడేజా ఇక్కడ  2 మ్యాచ్‌లు ఆడి  126 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లో కూడా  11 వికెట్లు పడగొట్టాడు.  2018లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో జడేజా.. ఓవల్ లో  జరిగిన టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  ఈ మ్యాచ్‌లో  86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీశాడు.  కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. 


 






టీమిండియా సారథి  రోహిత్ శర్మ  ఇక్కడ ఒక టెస్టు ఆడాడు. 2021 ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా  రోహిత్.. ఓవల్ లో జరిగిన టెస్టు (రెండో ఇన్నింగ్స్) లో  సెంచరీ సాధించాడు.  ఈ మ్యాచ్‌లో రోహిత్ 127 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టులలో రోహిత్‌ను ఓపెనర్‌గా నిలబెట్టిన ఇన్నింగ్స్‌లలో ఓవల్ కూడా ఒకటి. 


రన్ మిషీన్ విరాట్ కోహ్లీ  ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడి 169 పరుగులు సాధించాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన కోహ్లీ..  2018లో మాత్రం రాణించాడు. 2021లో కోహ్లీ ఓవల్‌లో రెండు ఇన్నింగ్స్ లలో  కలిపి 99 పరుగులు చేశాడు. 


టీమిండియాకు అతడి భయం.. 


ఓవల్‌లో టీమిండియా  బ్యాటర్ల  ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంటే  ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ మాత్రం జోరు చూపించాడు.   స్మిత్ ఇక్కడ  ఆరు టెస్టులు ఆడి ఐదు ఇన్నింగ్స్ లలో  391 పరుగులు చేశాడు. ఇందులో రెండు  సెంచరీలు కూడా ఉన్నాయి.   స్మిత్‌ బ్యాటింగ్ సగటు ఓవల్‌లో  97.75గా ఉండటం టీమిండియాను కలవరపెడుతున్నది.