Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్న వేళ  ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.  కంగారూల  ప్రధాన పేస్ అస్త్రం జోష్ హెజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్ నుంచి  తప్పుకున్నాడు.  ఈ మేరకు  క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.   మడమ గాయం కారణంగా హెజిల్‌వుడ్  ఈ టెస్టుకు దూరమైనట్టు   ప్రకటనలో పేర్కొంది. అతడి స్థానంలో ఇంగ్లాండ్ లోనే కౌంటీలు ఆడుతున్న  మైకెల్ నెసెర్‌కు జట్టులో చోటు కల్పించింది.  


గతేడాది నుంచే గాయంతో ఇబ్బందిపడుతున్న  హెజిల్‌వుడ్ .. ఈ ఏడాది  భారత్‌తో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా  ఇండియాకు వచ్చినా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే   తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ - 16 లో కూడా  ఏప్రిల్ 15 తర్వాత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో కలిసిన హెజిల్‌వుడ్..  మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడినా పెద్దగా   ప్రభావం చూపలేకపోయాడు.  ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ వరకైనా పూర్తిగా కోలుకుంటాడని ఆసీస్ భావించినా  ప్రాక్టీస్ సెషన్‌లో గాయం తిరగబెట్టడంతో అతడు ఓవల్ టెస్టు నుంచి తప్పుకున్నాడు. 


నెసెర్‌తో భర్తీ.. 


హెజిల్‌వుడ్ స్థానాన్ని  క్రికెట్ ఆస్ట్రేలియా  ఇంగ్లాండ్ లోనే కౌంటీలు ఆడుతున్న  మైకెల్ నెసెర్ తో భర్తీ చేసింది. అతడిని   స్టాండ్ బై  ప్లేయర్లుగా మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షాలు ఉన్నా వారిని కాకుండా నెసెర్‌ను నేరుగా  15 మంది సభ్యుల జాబితాలో చేర్చింది. 33 ఏండ్ల ఈ ఆల్ రౌండర్.. ఇటీవల మంచి టచ్‌లో ఉన్నాడు.    కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022-23లో  5 మ్యాచ్‌లు ఆడి  19 వికెట్లు తీయడమే గాక  బ్యాట్‌తో ఓ సెంచరీ కూడా సాధించాడు.  నెసెర్ ఇప్పటిదాకా   ఆసీస్ తరఫున   2 టెస్టులు,  2 వన్డేలు ఆడాడు. టెస్టులలో 7 వికెట్లు, వన్డేలలో  2 వికెట్లు తీశాడు.  అయితే నెసెర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా..? అనేది అనుమానమే.  హెజిల్‌వుడ్ గాయపడటంతో ఆ స్థానాన్ని  స్కాట్ బొలాండ్‌తో భర్తీ చేయించాలని  ఆసీస్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది.   ఒకవేళ బొలాండ్‌ను కాదని నెసెర్‌కు ఛాన్స్ ఇస్తే అతడి రూపంలో ఆసీస్‌కు మరో ఆల్   రౌండర్ దొరికినట్టే.  ఇప్పటికే జట్టులో కామెరూన్ గ్రీన్ రూపంలో  నిఖార్సైన ఆల్ రౌండర్ ఉన్నాడు. 


 


గాయపడ్డ హెజిల్‌వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్ మిస్ అయినా  ఆసీస్ - ఇంగ్లాండ్ మధ్య జరుగబోయే ప్రతిష్టాత్మక  యాషెస్ సిరీస్ వరకైనా జట్టుతో చేరతాడని  ఆస్ట్రేలియా భావిస్తున్నది.  జూన్ 16 నుంచి ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్) టెస్టుతో   యాషెస్ సిరీస్ మొదలుకానుంది. 






డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఆసీస్ జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, మైకెల్ నెసెర్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, టాడ్  మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్


స్టాండ్ బై ప్లేయర్స్ : మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా