‘‘బీజేపీ మీటింగ్ ఉందంటే కేసీఆర్ సార్ పెగ్గులేసుకుని టీవీల ముందు కూసుంటడు. టీఆర్ఎస్ మీటింగ్ లకు ఎవరూ రావడం లేదు. ఒక్కొక్కరికి ఫుల్ బాటిల్, వెయ్యి రూపాయలిస్తానన్న రావడం లేదు. మంచిర్యాల ప్రజల్లో మస్త్ జోష్ కన్పిస్తున్నది. ఈ జోష్ ఇంకా 5 నెలలుండాలే.. కేసీఆర్ అంతు చూద్దాం. తెలంగాణ అంతటా తిరుగుతున్నా’’ అని బండి సంజయ్ అన్నారు. ‘‘మహా జన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా నేడు (జూన్ 21) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో జరిగిన బహిరంగ సభకు బండి సంజయ్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.


బీఆర్ఎస్‌ను ఓడించేది బీజేపీనే 
బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని.. ఆత్మాభిమానమున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. ‘‘మోదీ పేద కుటుంబం నుండి వచ్చినోడు.. పేదల కష్టాలు తెలిసినోడు. పీఎం కాగానే పేదల కష్టాలను తొలగించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నడు. పీఎం ఆవాస్ యోజన కింద రూ.3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారు. మరి కేసీఆర్ ఏం చేసిండు? లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా? కొబ్బరికాయ కొట్టడానికే పరిమితమయ్యారు. మందు తాగుతూ మందిని ఎట్లా ముంచాలా? అని ఆలోచిస్తుంటడు. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల గల్లా పట్టి అడగండి.


వడ్ల పైసలు మోదీ ఇస్తున్నవే
వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తున్నవే. సుతిలీ తాడు నుండి రవాణా దాకా పైసలన్నీ కేంద్రం ఇస్తున్నవే. పల్లె ప్రగతి, స్మశానవాటిక, వడ్డీ లేని రుణాలు సహా అన్ని మోదీ ఇస్తున్నవే. కేసీఆర్ మాత్రం సిగ్గులేకుండా వాటివద్ద తన ఫోటోలు పెట్టుకుంటున్నడు. మోదీ ప్రభుత్వానికి మీరంతా నిలవాలని కోరుతున్నా.


‘‘కేసీఆర్ కొడుకు అమెరికాలో చిప్పలు కడిగిన మూర్ఖుడు. తెలంగాణ రాకముందు నీది, నీ అయ్యది బిచ్చపు బతుకులు. తినడానికి తిండిలేదు. ఫైసలు ఫైనాన్సోళ్లు బండ్లు గుంజుకుపోయిర్రు. మరి ఇయాల అధికారం వచ్చి వేల కోట్ల సొమ్ముతో బలిసి కొట్టుకుంటున్నడు. తెలంగాణపై జరిగిన ఓటింగ్ కు రాకుండా తాగి పడుకున్నడు. ఖమ్మంలో దొంగ దీక్ష చేసి తాగి పడుకున్నడు. సిగ్గులేకుండా చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చినట్లు చెప్పుకుంటున్నడు. నువ్వు చావు నోట్లో కాదు. మందు సీసాను నోట్లో పెట్టుకుని వచ్చినవ్.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు
ఎమ్మెల్యేలు మందు, మనీ పంచి గెలుస్తున్నరట. కేసీఆర్ కొడుకు మాత్రం పైసలు పంచరట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. మీ ముఖాలను చూసి ఓట్లు వేయడం లేదట. ప్రజల్లో మీకు విలువ లేదని కేసీఆర్ కొడుకు అంటుంటే స్పందించరా? ఆత్మాభిమానమున్న వాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈసారి కేసీఆర్ ఫొటో పెట్టుకుని ఓట్లు అడిగితే మీ సంగతి చెప్పడం ఖాయం.


నాకు పదవి శాశ్వతం కాదు
బండి సంజయ్ కి పదవి శాశ్వతం కాదు.. పదవుల కోసం మేం పనిచేయడం లేదు. జేపీ నడ్డా గారు ఫోన్ చేసి బండి సంజయ్ తప్పుకో అంటే బిస్తర్ పట్టుకుని ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తా. మా బలం కార్యకర్తలే. మా లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే. నిజమైన ఉద్యమకారులంతా బీజేపీకి మద్దతు తెలపాలి. ప్రజలంతా 5 నెలలుపాటు సమయమివ్వండి. నిలువనీడ లేని పేదలకు ఇండ్లు కట్టిస్తాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించి ఖాళీలను భర్తీ చేస్తాం’’ అని బండి సంజయ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు రఘు, పాయల శంకర్, రాష్ట్ర కార్యదర్వి పల్లె గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.