BRS News :  స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే రాజయ్య , సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు, భర్త ప్రవీణ్‌పై కూడా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు  చేశారు.  రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్‌ నవ్య మరోసారి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు, రాజయ్య పాల్పడ్డ వేధింపులకు సంబంధించి ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ అనుచరులతో ఎమ్మెల్యే తనపై తీవ్ర ఒత్తిడి చేయిస్తున్నారని నవ్య ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న రూ.20 లక్షలు, ఇవ్వకపోగా అప్పుగా తీసుకున్నట్లుగా పత్రంపై సంతకం పెట్టాలని తనపై తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. 


ఎమ్మెల్యే వర్గం ఒత్తిడికి తన భర్త తలొగ్గారని, సంతకం పెట్టాలంటూ తనపై ఆయనా ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం ఇస్తానన్న డబ్బులు అప్పుగా ఇస్తున్నట్లుగా చెబుతూ పత్రంపై సంతకం పెట్టాలని ఒత్తిడి చేయడం సబబేనా? అని నవ్య ప్రశ్నిస్తున్నారు. తాను డబ్బుల కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తనకు డబ్బులు తీసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. తనపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యే రాజయ్య, ఆయన పీఏ, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ మహిళతో పాటు వారి ప్రలోభాలకు లోనై తన మీద ఒత్తిడి తెస్తున్న భర్తను కూడా వదిలి పెట్టనని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని కేసు పెట్టి చర్యలు తీసుకోకపోతే చట్ట పరంగా పోరాడుతానని నవ్య చెబుతున్నారు. 
 
జనగామ జిల్లా ధర్మసాగర్ మండలం జనకీపురం సర్పంచ్ నవ్య  గతంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు.  ఆ విషయం కాస్త సంచలనంగా మారింది.  మరోసారి మంగళవారం మీడియా ముందుకు వచ్చిన నవ్య  ఈ సారి ఇంకొంచెం డోసు పెంచి ఆరోపణలు చేశారు. గతంలో జరిగిన వివాదం విషయంలో రాజయ్యే స్వయంగా నవ్య ఇంటికి వచ్చి.. ఎలాంటి గొడవలు లేవని.. అంత సెట్ చేసుకుంటామని దాటేశారు. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే.. ఇప్పుడు తాను డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయినట్టు.. తప్పుగా మాట్లాడుతున్నారని నవ్య ఆరోపించారు. తాను మహిళల రక్షణ కోసం పోరాడుతున్నానని.. అంతేకానీ ఎప్పుడు, ఎక్కడా డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు.


గతంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని.. బాండ్ రాసివ్వమని ఎమ్మెల్యే అనుచరులు తనపైన తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రూ. 20 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పంపిన బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టమని తన భర్త కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పంపిన బాండ్ పేపర్‌లో తనకు రూ.20 లక్షలు అప్పు ఇస్తున్నట్లు రాశారని పేర్కొన్న నవ్య... బాండ్‌పై సంతకం చేయమని తన భర్త కూడా ఒత్తిడి చేస్తున్నాడని నవ్య ఆరోపించారు.ఇదే అంశంపై పోలీసులకూ ఫిర్యాదు చేశారు.