BazBall: గత కొంత కాలం నుంచి ‘బ్యాజ్‌బాల్’ అనే మాట టెస్టు క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తుంది. ఇంగ్లండ్ ఆడే టెస్టు మ్యాచ్‌ల్లో అయితే మరీ ఎక్కువగా. 2023 యాషెస్ సిరీస్ మొదటి టెస్టు పూర్తయ్యాక ఈ బజ్ బాలింగ్‌పై చర్చలు మరింత ఎక్కువయ్యాయి. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో డిక్లేర్ చేసి మ్యాచ్ కోల్పోయిందా? అనే దానిపై చర్చలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఈ ‘బ్యాజ్‌బాల్’ అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది?


‘బ్యాజ్‌బాల్’ అంటే?
మ్యాచ్ పరిస్థితితో సంబంధం లేకుండా, పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో పట్టించుకోకుండా మొదటి బంతి నుంచి వేగంగా ఆడటానికి ప్రయత్నించడాన్నే ప్రస్తుతం ‘బజ్‌బాలింగ్’ అంటున్నారు. అయితే బ్యాజ్‌బాల్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు మైండ్ సెట్ కూడా. బ్యాటింగ్‌లో అయినా, ఫీల్డింగ్‌లో అయినా అటాకింగ్, డిఫెన్స్‌లో పాజిటివ్ నిర్ణయాలు మాత్రమే తీసుకోవడం ‘బ్యాజ్‌బాలింగ్’ మైండ్ సెట్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (వన్డే, టీ20) ఇన్‌స్టంట్ రిజల్ట్ ఇచ్చే వ్యూహాలను టెస్టు క్రికెట్‌లో కూడా అమలు చేయడం ‘బ్యాజ్‌బాల్’ స్టైల్.


‘బ్యాజ్‌బాల్’కు ఆ పేరు ఎలా వచ్చింది?
ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్‌కు నిక్ నేమ్ ‘బజ్ (Baz)’ అని ఉండేది. బ్రెండన్ మెకల్లమ్ దూకుడైన ఆటతీరుకు పెట్టింది పేరు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో ఆటగాడిగా ఉన్నప్పటి నుంచే వేగంగా ఆడటానికి ప్రాధాన్యత ఇచ్చే వాడు. ఇంగ్లండ్‌కు కోచ్‌గా వచ్చాక మెకల్లమ్, ప్రస్తుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ... ముగ్గురూ కలిసి ఈ తరహా మైండ్‌సెట్‌ను ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు పరిచయం చేశారు. ఈ ఆలోచన బ్రెండన్ మెకల్లమ్‌ది కాబట్టి దీనికి ‘బ్యాజ్‌బాల్’ అనే పేరు వచ్చింది అనుకోవచ్చు. ఒక ప్రముఖ క్రికెట్ పోర్టల్‌కు చెందిన జర్నలిస్టు మొదట ఈ పేరును ఉపయోగించాడు. తర్వాత ఇది జనాల్లోకి కూడా బాగా వెళ్లిపోయింది.


‘బ్యాజ్‌బాల్’ రూల్స్ ఇవే...
‘బ్యాజ్‌బాల్’ అంటే కళ్లు మూసుకుని బ్లైండ్‌గా హిట్టింగ్ చేసుకుంటూ వెళ్లిపోవడం, నచ్చినప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం మాత్రమే కాదు. దీనికంటూ కొన్ని రూల్స్ కూడా ఉన్నాయట. ఒక ప్రముఖ క్రికెట్ రైటర్ ‘బ్యాజ్‌బాల్’కు ఏడు రూల్స్ కూడా పెట్టారు.


1. మిగతావారిపై తక్కువ ప్రభావం చూపించే వాతావరణం
2. నెగిటివ్‌గా అస్సలు మాట్లాడకూడదు.
3. కచ్చితంగా గెలిచి తీరాలనే కసి.
4. ఓడిపోతాం/విఫలం అవుతాం అనే భయం ఉండకూడదు.
5. చిన్న చిన్న విషయాలకు కూడా మెచ్చుకోలు ఉండాలి.
6. ఎదుటివారికి ఇచ్చే మెసేజ్ చాలా సింపుల్‌గా ఉండాలి.
7. మానసిక స్వేచ్ఛ నిస్తూ సరదాగా ఉండాలి. అలా మిగతావారిని ఉండనివ్వాలి.


ఈ తరహా ఆటతీరు డ్రెస్సింగ్ రూంను ఇప్పటికే చాలా పాజిటివ్‌గా మార్చిందని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నారు. ఆటను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే అంశం గురించే తాము ఆలోచిస్తున్నామని తెలిపారు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు కూడా ‘బ్యాజ్‌బాలింగ్’పై పాజిటివ్‌గా స్పందించారని పేర్కొన్నాడు.


టెస్టు క్రికెట్‌పై ‘బ్యాజ్‌బాల్’ ప్రభావం
ఏ తరహా క్రికెట్‌లో అయినా ప్రత్యర్థి జట్టు వ్యూహానికి సరైన ప్రతి వ్యూహం పన్నితేనే విజయం సాధ్యం అవుతుంది. ఇంగ్లండ్ వ్యూహం ‘బ్యాజ్‌బాల్’ కాబట్టి మిగతా జట్లు దానికి తగ్గట్లు ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి టెస్టు క్రికెట్ మీద ‘బ్యాజ్‌బాల్’ ప్రభావం ఇప్పటికే ప్రారంభం అయిందనుకోవాలి.


2022లో ఇంగ్లండ్ ‘బ్యాజ్‌బాలింగ్’ ప్రారంభించిన వెంటనే వారిని విజయాలు వరించాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వారు 277, 299, 296 పరుగులను నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేదించి విజయాలు అందుకున్నారు. న్యూజిలాండ్‌పై ఒక జట్టు వరుసగా మూడు సార్లు 250కి పైగా ఛేజింగ్ చేయడం ఇదే మొదటిసారి. అలాగే భారత్‌పై కూడా బర్మింగ్‌హాం టెస్టులో కేవలం 78 ఓవర్లలోనే 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఇంగ్లండ్ ఛేజింగ్ చేస్తూ గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి.


అలాగే పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలిరోజు కేవలం 75 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. వారి రన్‌రేట్ 6.75గా ఉంది. ఇంత వేగంగా టెస్టుల్లో ఆడతారని ఎవరూ కల్లో కూడా ఊహించి ఉండరు. టెస్టుల్లో ఒక జట్టు ఒక రోజు చేసిన అత్యధిక స్కోరు ఇదే. దీంతో మొదటి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం వంటివి అయితే చాలా సార్లు జరిగాయి.


నైట్ వాచ్‌మెన్ కాదు నైట్‌హాక్
‘బ్యాజ్‌బాల్’ ఆటతీరు నైట్ వాచ్‌మెన్ నిర్వచనాన్ని కూడా మార్చేసింది. టెస్టు క్రికెట్‌లో ఏదైనా రోజు చివర్లో కొన్ని ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉన్నప్పుడు బౌలర్‌ను పంపించి వికెట్ పడకుండా కాపాడటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు బ్యాటింగ్‌కు వచ్చే బౌలర్‌ను ‘నైట్‌వాచ్‌మెన్’ అంటారు.


2022లో టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు రోజు చివర్లో స్టువర్ట్ బ్రాడ్‌ను ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉండమనే వారట. కానీ అది నైట్ వాచ్‌మెన్ తరహాలో వికెట్లు కాపాడటానికి కాదు. రోజు చివర్లో వికెట్ పడితే ఎదుటి జట్టు ఆధిపత్యం సాధించకుండా, ఇటు ఇంగ్లండ్‌కు కూడా రిస్క్ లేకుండా బ్రాడ్‌ను బాదమని చెప్పేవారట. రోజు చివర్లో బ్రాడ్ దగ్గరకు బ్రెండన్ మెకల్లమ్ వచ్చి ‘ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉండు. జనాలు నిశ్శబ్దంగా ఉన్నారు. మొదటి బంతి నుంచే బౌండరీలకు ప్రయత్నించి వారిలో ఉత్సాహాన్ని నింపు.’ అన్నాడట. అతనికి ‘నైట్‌హాక్’ అనే పేరు కూడా పెట్టారట. అప్పట్లో స్టువర్ట్ బ్రాడ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో కూడా ‘నైట్‌హాక్’ అనే పెట్టుకున్నాడు.


‘బ్యాజ్‌బాల్’పై విమర్శలు కూడా...
‘బ్యాజ్‌బాల్’పై ఇంగ్లండ్ ఆటగాళ్ల నుంచే విమర్శలు వచ్చాయి. మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ దీనిపై మాట్లాడుతూ ‘నేను విన్న చెత్త విషయాల్లో బ్యాజ్‌బాల్ ఒకటి. ఇంగ్లండ్ ప్రస్తుతం ఎక్సైటింగ్ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తుంది.’ అన్నాడు.


భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా దీనిపై స్పందించాడు. ‘ఏ పరిస్థితుల్లో అయినా ఒకేలా ఆడటం ఎప్పుడూ వర్కవుట్ అవ్వదు. కొన్ని రకాల వికెట్ల మీద ప్రతి బంతినీ అటాక్ చేస్తే వికెట్ కోల్పోతాం. దీనికి అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం వికెట్, పరిస్థితులను గౌరవించి దానికి తగ్గట్లు ఆడాలి.’ అన్నాడు. ఈ తరహా ఆటతీరు ఆకర్షణీయంగా కనిపించినా ఎక్కువ కాలం దీనికి మనుగడ ఉండదని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. మరి ఈ ‘బ్యాజ్‌బాల్’ టెస్టు క్రికెట్‌కు భవిష్యత్తుగా మారు


ప్రస్తుతం ప్రపంచంలో టీ20 లీగుల మేనియా నడుస్తుంది. టెస్టుల నుంచి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి రాబోయే యువత కూడా అటు ఆసక్తి చూపించకపోవచ్చు. కాబట్టి టీ20లు ఆడే వారి నుంచే టెస్టులకు కూడా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. కానీ వారి గేమ్ డీఎన్ఏలో వేగవంతమైన శైలినే ఉంటుంది. కాబట్టి ‘బజ్‌బాలింగ్’ అప్రోచ్‌ను రాబోయే కాలంలో టెస్టుల్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంది.