PCB New Chief: ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం, వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనాలా..? వద్దా..? అన్న చర్చలు సాగుతున్న వేళ పాకిస్తాన్ క్రికెట్‌లో ఊహించని పరిణామం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ప్రస్తుతం పీసీబీకి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న నజమ్ సేథీ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. అతడి స్థానంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బలపరిచిన జకా అష్రఫ్ పీసీబీ చీఫ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఏమైంది..?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. బీసీసీఐలో మాదిరిగా అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాదు. అక్కడి వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం కల్పించుకుంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి అనుకూలమైన వ్యక్తికి పీసీబీ చైర్మెన్ పదవి దక్కుతుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో పీసీబీ చైర్మెన్ గిరి ఆయన సహచర ఆటగాడు, మిత్రుడు రమీజ్ రాజాకు దక్కింది. కానీ ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం.. రమీజ్ ను తొలగించి ప్రధాని షెహబాజ్ షరీఫ్ మిత్రుడు నజమ్ సేథీని పీసీబీ తాత్కాలిక చీఫ్‌గా (2023 డిసెంబర్‌లో) నియమించిన విషయం తెలిసిందే.
గడిచిన ఆరు నెలలుగా ఆయనే పీసీబీ చైర్మెన్‌గా ఉంటున్నా సేథీ పదవీకాలం జూన్ 21తో ముగియనున్నది. అయితే పాక్ ప్రధాని అండతో మళ్లీ ఆయనకే ఆ పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఇందుకు పాకిస్తాన్ ప్రభుత్వ కూటమిలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఒప్పుకోలేదు. ఆ పార్టీ కీలక నేత అసిఫ్ జర్దారీ.. సేథీని తొలగించాలని ప్రధాని వద్ద ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంతో షెహబాజ్ - జర్దారీ మధ్య విభేదాలు కూడా వచ్చినట్టు సమాచారం. దీంతో ఇదేదో రాజకీయ అనిశ్చితికి దారితీసేలా ఉందని.. తాను పీసీబీ నెక్స్ట్ చైర్మెన్ రేసులో లేను అని సేథీ ట్విటర్ ద్వారా వెల్లడించాడు.
సేథీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘అందరికీ సలాం.. అసిఫ్ జర్దారీ, షెహబాజ్ షరీఫ్ ల మధ్య విబేధాలకు నేను కారకుడిని కాదలుచుకోలేదు. పీసీబీకి ఈ రాజకీయ అనిశ్చితి మంచిదికాదు. ఈ పరిస్థితుల మధ్య నేను పీసీబీ చైర్మెన్ పదవికి అభ్యర్థిగా ఉండలేను. కొత్తగా వచ్చేవారికి శుభాకాంక్షలు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నాడు.
కొత్త చైర్మెన్ ఎవరు..?
పీసీబీ కొత్త చైర్మెన్‌గా పీపీపీ బలపరుస్తున్న చౌధరి మహ్మద్ జకా అష్రఫ్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నాడు. తన కాలేజీ రోజుల నుంచే ఆయనకు పీపీసీతో బలమైన సంబంధాలున్నాయి. 1970లో నాటి జుల్ఫికర్ అలి భుట్టో ప్రభుత్వం నుంచే.. భుట్టో కుమారుడు అసిఫ్ అలి జర్దారికి అష్రఫ్ స్నేహితుడు. అసిఫ్ అలి జర్దారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అష్రఫ్.. 2011 అక్టోబర్‌లో పీసీబీ చీఫ్‌గా నియమితుడయ్యాడు. కానీ 2014లో నాటి పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అష్రఫ్ చైర్మెన్ గిరిని కూడా తొలగించాడు. ఆ తర్వాత ఆ స్థానంలో ప్రస్తుత చీఫ్ నజమ్ సేథీని నియమించాడు. ఇక తొమ్మిదేండ్ల తర్వాత అదే అష్రఫ్.. ఇప్పుడు నజమ్ సేథీ పీసీబీ చీఫ్ పోస్టుకు చెక్ పెట్టి పగ తీర్చుకోవడం గమనార్హం. అయితే పీసీబీలో కొత్త కార్యవర్గం వచ్చేంతవరకూ నజమ్ సేథీనే అధ్యక్ష పదవిలో కొనసాగుతాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial