Ball Tampering Scandal: ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు దారుణంగా అవమానించారు. సాండ్‌పేపర్ గేట్ (బాల్ టాంపరింగ్) ఉదంతాన్ని పదే పదే గుర్తుకు చేస్తూ అతడిని గేలి చేశారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా నాలుగో రోజు (సోమవారం) ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మ్యాచ్ చూడటానికి వచ్చిన ఇంగ్లాండ్ అభిమానులంతా బిగ్గరగా అరుస్తూ స్మిత్‌ను అవమానించారు.
ఏం జరిగిందంటే..
నాలుగో రోజు ఆటలో భాగంగా స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ అభిమానులు.. ‘స్మిత్.. నువ్వు ఏడ్వటం మేం టీవీలలో చూశాం’ (Smith, We Saw You Crying on telly)అని బిగ్గరగా అరుస్తూ రచ్చ చేశారు. స్టేడియానికి స్టేడియమే ఇలా అరుస్తుండటంతో స్మిత్ అవమానభారంతో తల దించుకున్నాడు. ముఖం మీద నవ్వు కనిపించినా లోలోపల కుమిలిపోయాడు.
కారణమదే..
స్మిత్‌ను ఇంగ్లాండ్ అభిమానులు గేలిచేసింది 2018లో జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం గురించి కావడం గమనార్హం. ఆ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆసీస్‌కు స్మిత్ సారథిగా ఉన్నాడు. కేప్‌టౌన్ టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు కామెరూన్ బ్యాంక్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లతో పాటు స్టీవ్ స్మిత్ కూడా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఈ ఘటన నివ్వెరపోయేలా చేసింది. స్మిత్‌తో పాటు వార్నర్, కామెరూన్ తప్పులు ఒప్పుకోవడంతో వారికి శిక్షలు కూడా విధించారు. కామెరూన్ కు 9 నెలల పాటు.. వార్నర్, స్మిత్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నారు. అయితే తన తప్పును ఒప్పుకునే క్రమంలో స్మిత్.. మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కన్నీరుపెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ అభిమానులు ఇప్పుడు ఇదే విషయాన్ని స్మిత్‌కు గుర్తుకు చేస్తూ.. ‘స్మిత్.. నువ్వు ఏడ్వటం మేం టీవీలలో చూశాం’ అని గేలి చేశారు.
వార్నర్‌ను సైతం..
స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్‌ను కూడా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ వదల్లేదు. నాలుగో రోజు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఫీల్డ్ లోకి వస్తున్న వార్నర్‌ను చూడగానే అక్కడే ఉన్న ఇంగ్లీష్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్.. ‘చీట్ చీట్’ అని అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ అభిమానులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial