బీఆర్ఎస్ - బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని ఈ మధ్య పదే పదే వార్తలు వస్తున్న వేళ ఆ వాదనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖండించారు. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే.. చెప్పుతో కొట్టడంటూ బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఈ తీవ్ర వాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ వెనుక రాముడు లాంటి ప్రధాని మోదీ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం మొదలైందని.. అది ఎప్పటికీ జరగబోదని అన్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య లోపాకాయికారీ ఒప్పందం ఉందని.. అందుకే బీజేపీని దెబ్బ తీయడానికి బీఆర్ఎస్‌తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు బీజేపీని 370 స్థానాల్లో గెలిపించాలని బండి సంజయ్ కోరారు. కేంద్రంలో బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని దీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి ఈసారి 400 సీట్లకు పైబడి మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశానికి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మ రక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని.. అలాంటప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.