Bandi Sanjay in Mancherial: ‘‘మై డియర్ కల్వకుంట్ల కమీషన్ల రావు నువ్వు అధికారంలోకి రానే రావు. డిసెంబర్ 3 నుంచి కేసీఆర్ (KCR) మాజీ సీఎం. ఎన్ని దుష్టపన్నాగాలు పన్నినా బీఆర్ఎస్ ఓటమి తథ్యం’’ అని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. కేసీఆర్ హామీ ఇచ్చిన పని ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. గిరిజనులకే పోడుపట్టాలివ్వలేదని, గిరిజనేతరులకు పట్టాలంటే నమ్మేదెవరని అన్నారు. ఇరువర్గాల మధ్య కొట్లాట పెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా రమేశ్ రాథోడ్ (Ramesh Rathode) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా మంచిర్యాల జిల్లా జన్నారంలో ‘‘సింహగర్జన’’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. 


‘‘మై డియర్ కల్వకుంట్ల కమీషన్ రావు నువ్వు ఏం చేశావని బీఆర్ఎస్ కు ఓటేయాలి? కుంగిపోయిన కాళేశ్వరం చూద్దామంటే రావు. 317 G.O వల్ల చనిపోయిన ఉద్యోగ కుటుంబాల దగ్గరికి రావు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థుల దగ్గరికీ రావు. ఉద్యోగుల సమస్యలపై చర్చలకు రావు. పోడు పట్టాల కోసం పోలీస్ దెబ్బలు తిన్న గిరిజన బిడ్డల దగ్గరికి రావు. అసలు నువ్వు ఫాంహౌజ్ విడిచి రానే రావు. మరి నీకెందుకు ఓటేయాలి. అందుకే చెబుతున్నా. వచ్చే ఎన్నికల్లో నువ్వు అధికారంలోకి రావు.. రావు... రావు...రానేరావు....రాసిపెట్టుకో...’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.


ఖానాపూర్ కంచుకోట
‘‘ఖానాపూర్ రమేశ్ రాథోడ్ కంచుకోట. రాథోడ్ గెలుపు పక్కా... బీఆర్ఎస్ నేతల ముఖాలు ఇక్కడ చెల్లడం లేదు. కాంగ్రెస్ కాసులకు అమ్ముడుపోయే పార్టీ. పొరపాటున రెండు పార్టీలు అధికారంలోకి వస్తే కొద్దిరోజుల్లోనే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో సీఎం సీటు కొట్లాట మొదలైతది. బీఆర్ఎస్ లో కేటీఆర్ సీఎం అయితే ఆ పార్టీలో ఎవరూ మిగలరు. రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగాలన్నా... పదేపదే ఎన్నికలు రాకుండా నివారించాలన్నా బీజేపీ అధికారం రావాల్సిన అవసరం ఉంది.


ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలియడంతో కేసీఆర్ దుష్టపన్నాగాలు పన్నుతున్నారు. కాంగ్రెసోళ్లకు పైసలిచ్చి గెలిపించుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ ఎన్ని చేసినా డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నరు. వాస్తవాలు మాట్లాడుతుంటే కేసీఆర్ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. అమెరికాలో నెలకు కోటి రూపాయల జీతం తీసుకునేవాడట.. అమెరికాలో చిప్పలు కడిగేటోడికి కోటి రూపాయలు ఎవరిస్తారు? మీ అయ్య లేకుండా నిన్ను కుక్కలు కూడా దేఖవ్. నెలకు కోటి సంపాదించానని చెప్పి... అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న సంగతి ఎందుకు చెప్పడం లేదు? రాష్ట్రాన్ని లూటీ చేసి ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దొబ్బి తెలంగాణను అప్పులపాల్జేసిండు. పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర రూపాయల అప్పు చేసిండు..


కేసీఆర్ దుష్టపాలన పుణ్యమా అని జీతాలిచ్చే పరిస్థితి లేదు. నిన్న సీఎం అంటున్నడు.. గిరిజనేతరులకు పోడు పట్టాలిస్తాడట... సిగ్గుండాలే.. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలే ఇవ్వలేదు. కొత్తగా గిరిజనేతరులకు పట్టాలిస్తామని చెబుతూ గిరిజన, గిరిజనేతర ప్రజల మధ్య కొట్లాట పెట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడు.


నాపైన 74 కేసులు పెట్టిన్రు
అన్నా... మీ పక్షాన కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేసిన. లాఠీదెబ్బలు తిన్న. రక్తం చిందించిన. నాపై దాడి చేసినా భయపడలే. కేసులు పెట్టినా, జైలుకు పంపినా బెదరలే... మీ కోసం కొట్లాడితే నాపై ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 74 కేసులు పెట్టిర్రు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నరు. అయినా భయపడతనా? కాషాయ జెండా పట్టుకుని మీకోసం కొట్లాడుతూనే ఉంటా. పేదల రాజ్యం తీసుకొచ్చేదాకా పోరాడుతూనే ఉంటా. గడీల పాలనను బద్దలు కొట్టేదాకా పోరాడుతూనే ఉంటా. పోడు భూములకు పట్టాల కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ. 


రాష్ట్రంలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఫార్టీలు ఒక్కటే. మూడు పార్టీలు కుమ్కక్కై బీజేపీని దెబ్బతీసి అధికారంలోకి రావాలనుకుంటున్నయ్. నేను చెబుతున్నా... కాంగ్రెస్, ఎంఐఎం కు ఓట్లేస్తే బీఆర్ఎస్ కు పడ్డట్లే... గత నాలుగేళ్లుగా మీకోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరుతున్నా. ప్రజల్లో కాంగ్రెస్ లేనేలేదు. మీడియాలో ప్రచారం తప్ప కాంగ్రెస్ కు క్యాడర్ లేనేలేదు. పాతబస్తీలోకి సభ పెట్టాలంటే ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలంటూ ప్రగల్భాలు పలికిన ఒవైసీకి డేట్, టైం ఫిక్స్ చేసి సవాల్ విసిరిన. పోలీసులు అడ్డంకులు స్రుష్టించినా అధిగమించా. అన్ నోన్ నెంబర్ నుండి ఫోన్ చేసి భార్యాపిల్లలను చంపుతామని బెదిరించినా భయపడలే. గుండెపోటుతో చావు అంచుదాకా పోయి వచ్చినోడిని. ఆ బెదిరింపులకు భయపడతానా?’’ అని బండి సంజయ్ మాట్లాడారు.