Bandi Sanjay on Medak After Clash Between 2 Communities Over Cow Transport| మెదక్: గోవుల రవాణా విషయంలో వివాదం తలెత్తిన మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మెదక్ లో తలెత్తిన వివాదంపై ఆరా తీశారు. ఈ ఘటనపై ఆదివారం బండి సంజయ్ మాట్లాడుతూ.. అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడాలని, దాంతోపాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు.


బాధితులపై అక్రమ కేసులు బనాయించవద్దని, అమాయకులను ఇబ్బందులకు గురిచేయకూడదని చెప్పారు. పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే మెదక్ ఘటనలో పరిస్థితులు అదుపులోకి వస్తాయన్నారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎవరికీ కొమ్ము కాయకూడదని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.


గోవుల రవాణా విషయంపై వివాదం, 144 సెక్షన్‌ విధించిన పోలీసులు
గోవధ చేసేందుకు కొందరు ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన గో రక్షకులు కొందరు గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవడంతో వివాదానికి దారితీసింది. మెదక్ జిల్లా కేంద్రంలో వన్ టౌన్ లో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దాంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని మెదక్ పట్టణంలో 144 సెక్షన్ విధించినట్లు  మెదక్ ఎస్పీ బి బాలస్వామి తెలిపారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎక్కడైనా గుమిగూడినట్లు కనిపిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. గోవుల తరలింపు, గోవధ ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇదివరకే కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, 144 సెక్షన్ కొనసాగుతోందని చెప్పారు.


శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య గోవుల విషయంపై ఘర్షణలు  
మెదక్ పట్టణంలో జూన్ 15న రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆవులను రవాణా చేస్తుంటే భారతీయ జనతా యువమోర్చా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగినట్లు తెలిపారు. దాడులు చేసుకోవడంతో ఇరువర్గాలలో పలువురికి గాయలు కాగా, అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద ఆవులు కనిపించడంతో బక్రీద్ సందర్భంగా గోవధ చేసేందుకు తరలిస్తున్నారని వాదన మొదలైంది.


మరోచోట సైతం ఆవులు ఉన్నాయన్న సమాచారం మేరకు సీఐతో కలిసి అక్కడికి వెళ్తుండగా, ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరోవర్గం యువకుడిపై కత్తితో దాడిచేయడం కలకలం రేపింది. ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం ఇది ఇరు వర్గాల దాడికి దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, దాడులు చేసుకుంటున్న కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. 
Also Read: లోటస్ పాండ్‌లో జగన్ ఇంటి నిర్మాణాల కూల్చివేతలో ట్విస్ట్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌పై వేటు