Bandi Sanjay :    ‘‘తెలంగాణ అభివ్రుద్ది కోసం గత 9 ఏళ్లలో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయిలకుపైగా కేటాయించింది. 4 కోట్ల మంది ప్రజల కోసం ఆ డబ్బును కేటాయిస్తే నలుగురు దోచుకుంటున్నరు. తెలంగాణకు కేంద్రం ఇఛ్చిన నిధులతోపాటు, చేసిన అభివ్రుద్ధిపై చర్చకు రమ్మంటే.... రాకుండా కేసీఆర్ పారిపోతున్నడు. బీజేపీ ధాటికి తట్టుకోలేక టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుని దేశమ్మీద పడ్డారు‘‘అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.  కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందన్నారు. ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైతే అన్ని వర్గాలు అసంత్రుప్తితో ఎందుకున్నాయో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ సాధన కోసం బీజేపీ చేసిన పోరాటాలను, అమరుల బలిదానాలను స్మరించుకున్నారు. 
 
రామగుండం ఫ్యాక్టరీ కోసం 6 వేల 338 కోట్లు, జాతీయ రహదారుల కోసం 1.10 లక్షల కోట్లు, ధాన్యం కొనుగోళ్ల కోసం లక్ష కోట్లకుపైగా చెల్లించాం. మొత్తంగా 4 కోట్ల ప్రజల కోసం 9 ఏళ్లలో 4 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణలో సంపదను స్రుష్టించేందుకు లక్షల కోట్లు కేటాయిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కేంద్ర పథకాలను అమలు చేయడం లేదని బండి సంజయ్ విమర్శించారు.  మరోవైపు దేశాన్ని అభివ్రుద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం అహర్నిశలు క్రుషి చేస్తోంది. ఆర్దిక ప్రగతిలో దూసుకుపోతోంది. ఇంగ్లండ్ ను దాటి ఆర్ధిక ప్రగతిలో 5వ  స్థానానికి చేరుకుంది. 2047 నాటికి నెంబర్ వన్ కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.  తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా మూర్ఖత్వ పాలన కొనసాగుతోంది. కేంద్రం 4 కోట్ల ప్రజల కోసం 4 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తే... కేసీఆర్ మాత్రం నలుగురి కోసం పంచుకుంటూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసింది. అభివ్రుద్దిపై చర్చకు రమ్మని అడుగుతుంటే... చర్చకు రాకుండా కేసీఆర్ పారిపోతున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. 


కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైతే... రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయి ఏ రైతన్నను పలకరించినా ఎందుకు కన్నీళ్లే కారుస్తున్నారో చెప్పాలని డిమాండ ్చేశారు.  ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేసింది. వాళ్ల బాధలను పంచుకుంది. సమస్యలన్నీ తెలుసుకున్నాకే.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించాం. ఎందుకంటే విద్య కోసం ఒక్కో కుటుంబం సగటున రూ.లక్ష ఖర్చు చేస్తోంది. వాళ్లపై ఎనలేని భారం పడుతోంది. ప్రభుత్వ స్కూళ్లను చూస్తే అధ్వాన్నంగా మారాయి. కనీస వసతుల్లేవ్? చాక్ పీసులకు కూడా డబ్బుల్లేని దుస్ధితి. ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించి ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతాం. 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజు రీయంబర్స్ మెంట్లు బకాయిల్లేకుండా చెల్లిస్తాం. ప్రతి ఏటా ముందుగానే ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లిస్తాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులపై భారం పడకుండా చూస్తామని హమీ ఇచ్చారు. 


పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాం. ఎందుకంటే.. ఈరోజు సగటున ఒక్కో కుటుంబం 50 వేల నుండి లక్ష రూపాయలు ఖర్చు చేస్తోంది. పెద్ద పెద్ద రోగాలొస్తే వైద్యం చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోలేక ప్రాణాలు గాల్లో కలిసే దుస్థితి ఏర్పడింది. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం.  ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం. అట్లాగే నిలువ నీడలేని పేదలు ఎంతోమంది ఉన్నరు. కిరాయిలు కట్టలేక అల్లాడుతున్నరు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగే అలాంటి వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాం. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఏనాడూ కేసీఆర్ ఫ్రభుత్వం ఆదుకోలేదు. ఇటీవల ఎకరాకు రూ.10 వేలు సాయం చేస్తానని హామీ ఇచ్చినా 5 పైసలు కూడా సాయం చేయలేదు. ఉచితంగా యూరియా, విత్తనాలు ఇస్తానని మాట తప్పారు. రుణమాఫీని అమలు చేయడం లేదు. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే రైతును ఆదుకుంటాం. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి పంట నష్టపోయిన రైతుకు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.  బీజేపీ అధికారంలోకి రాగే ఖాళీ ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తాం.


వస్తుంటే ఎక్కడ చూసినా కేసీఆర్ హోర్డింగ్స్ కన్పిస్తున్నయ్. యాడ్స్ కన్పిస్తున్నయ్... ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సీఎంఓ నుండి పంపిన స్ర్కిప్ట్ ప్రకారమే ప్రచారం చేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. చివరకు పోలీసులను కూడా మఫ్టీలో వెళ్లి ప్రచారం చేయాలని, లేనిపక్షంలో ప్రమోషన్లు ఇవ్వబోమంటూ బెదిరించే స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం చేరుకుంది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చేతిలో బందీ అయ్యింది.  తెలంగాణ బంగారమైతే... రైతుల ఆత్మహత్యల్లో ఎందుకు అగ్రస్థానంలో ఉంటుంది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటరు?  జీతాలు రాక ఆర్టీసీ ఉద్యోగులెందుకు చనిపోతున్నరు? 317 జీవోవల్ల ఉద్యోగులెందుకు చెట్టుకొకరై నేలరాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఒక్కసారి ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమాలను గుర్తుకు చేసుకోండి. మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె స్పూర్తితో పోరాడదం.. బీజేపీతో కలిసి రావాలని కోరుతున్నా.  బీఆర్ఎస్ పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ చేసే పోరాటాలకు కలిసి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.