యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
‘ప్రాజెక్ట్ K’పై రానా సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఈ చిత్రం గురించి నటుడు రానా దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించబోతోందని జోస్యం చెప్పారు. ‘ది రైజ్ ఆఫ్ ది పాన్ ఇండియా స్టార్: హౌ టు బ్రేక్ బౌండరీస్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ జియోగ్రఫీ’ అనే చర్చాగోష్టిలో పాల్గొన్న రానా, ‘ప్రాజెక్ట్ K’ గ్లోబల్ తెలుగు ఫిల్మ్ గా మారబోతోందని వెల్లడించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాల రికార్డులను ఈ సినిమా బద్దలుకొట్టబోతోందని తేల్చి చెప్పారు. “నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలు చేయలేని కొత్త రికార్డులను నెలకొల్పబోతోందన్నారు. ఈ సినిమా కచ్చితంగా గ్లోబల్ ఫిల్మ్ గా అవతరిస్తుంది. నేను ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో విలన్ రోల్ కోసం కమల్ తో సంప్రదింపులు
తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమాకు సంబంధించి క్రేజ్ అప్ డేట్ అందుతోంది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ తో ఈ చిత్ర నిర్మాతలు మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఆయనను విలన్ పాత్ర పోషించాలని కోరుతున్నారట. అయితే, ఈ చర్చలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని మేకర్స్ అడుగుతున్నారు. ఇందుకోసం రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీనిపై కమల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో మళ్లీ ఆయనతో చర్చలు జరిపి దీనిపై స్పష్టత ఇస్తామని వెల్లడించింది.
వచ్చే ఏడాది జనవరి 12న ‘ప్రాజెక్ట్ K’ విడుదల
‘ప్రాజెక్ట్ K’ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనే కాకుండా, పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: మన హీరోయిన్లు చాలా రిచ్ గురూ, అత్యధిక ఆస్తులు కలిగిన నటి ఈమే!