Delhi Election Results 2025 | ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆధిక్య స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేయడంతో కాషాయ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అధికార ఆప్ 28 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచి, ఎదురీదుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని తాము ముందే ఊహించామన్నారు. 


ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు తమకు వద్దని ఢిల్లీ ప్రజలు ఆప్‌ను వద్దనుకున్నారు. అవినీతి, అక్రమాలతో జైలుకు వెళ్లిన వ్యక్తిని ఢిల్లీ తిరస్కరించింది.  మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారు. రాష్ట్రపతిని, ప్రధానిలను ఎదిరించి వారికిష్టం వచ్చినట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ పాలించింది. ప్రజాస్వామ్య పరిపాలన రావాలని ఆశించి, హస్తిన ప్రజలు ఢిల్లీలో ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు.






 


బీజేపీకి అధికారంతో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. చేసే తప్పులను వ్యతిరేకిస్తే తమ పార్టీ ఎమ్మెల్సీలపై వేటు వేస్తున్నారు. దీనిపై మేం ప్రశ్నించాం. త్వరలో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని’ కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.



ఆప్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే న్యూఢిల్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసినా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం బీజేపీ హవాను అడ్డుకోలేకపోతున్నారు. ఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఆధిక్యం సాధించడానికి ఆపసోపాలు పడుతున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. పర్వేశ్ కి 16903 ఓట్లు కాగా, కేజ్రీవాల్ కు 16473 ఓట్లు పోలయ్యాయి. మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కు 2812 ఓట్లు రాగా, మూడో స్థానంలో నిలిచారు.