Bandi Sanjay Challenge To KCR: కాంగ్రెస్ (Telangana Congress Party) పార్టీ ఆరు హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరుగురు ముఖ్యమంత్రులు ఉంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. శనివారం ఆయన భైంసా (Bhainsa)లో ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చిన 5 హామీలనే నెరవేర్చలేకపోతోందన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్లకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసినా వృథా అని అన్నారు. 


'బీజేపీని చూస్తే కేసీఆర్ కు భయం'


తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఈ పనులు సరిగ్గా చేశామని కేసీఆర్ చెప్పగలరా? అని బండి సంజయ్ నిలదీశారు. రాష్ట్రంలో ఫలానా పనులు చేశామని చెప్పడానికి కేసీఆర్ వద్ద ఏమీ లేదన్నారు. అందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని విమర్శించారు. బీజేపీకి ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబం వల్లే తెలంగాణ రాలేదని, ప్రజలందరి పోరాటం వల్లే వచ్చిందన్నారు. మెడికల్ కాలేజీల కోసం సీఎం కేసీఆర్ అప్లై కూడా చేయలేదని, దేశానికి 157 కాలేజీలు ఇచ్చిన ప్రధాని మోదీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకివ్వలేదని కరీంనగర్ సభలో అడగడం సిగ్గు చేటని అన్నారు. మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి దరఖాస్తు కూడా పంపించని కేసీఆర్ వాటి గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేదన్నారు. దరఖాస్తు చేసుకోకుండా విద్యార్థులను పరీక్షలకే హాజరు కానివ్వమని, అలాంటిది మెడికల్ కాలేజీలకు అప్లై కూడా చేసుకోకుండా కేసీఆర్ వాటి గురించి మాట్లాడడం దారుణమన్నారు. బీజేపీని నిత్యం తిట్టే పాలక పార్టీలున్న తమిళనాడుకు 11, బెంగాల్‌కు 7 మెడికల్ కాలేజీలు మంజూరైన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.


సీఎంకు సవాల్ 


కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకరా లేక వినోద్ రావా? అనే సందేహం ప్రజల్లో ఉందన్నారు బండి సంజయ్. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ నిధులిచ్చింది కేంద్రమేననే విషయం కేసీఆర్‌కు సోయి లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్, వరంగల్, జగిత్యాలతో పాటు తీగలగుట్టపల్లి ఆర్వోబీ, రైల్వే లైన్ నిధులన్నీ తానే తీసుకొచ్చానన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయ కొట్టి ఫోజులు ఇచ్చారని మండిపడ్డారు. ఈ విషయంపై కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఏ ఒక్కరోజైనా కరీంనగర్ ప్రజల కోసం పోరాటాలు చేశారా.? అని నిలదీశారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల పక్షాన పోరాడి జైలుకు వెళ్లానని చెప్పారు. తనపై కేసీఆర్ 74 కేసులు పెట్టారని, ఏనాడూ తన భార్యా పిల్లలకు పూర్తి సమయం కేటాయించలేదని బండి సంజయ్ చెప్పారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే వారిని, బీజేపీని గెలిపించాలని కోరారు.


కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని కర్ణాటక నుంచి రైతులు, యువకులు తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ముథోల్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి రామారావుపటేల్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాందేడ్‌ నుంచి నిర్మల్‌ వరకు రైలు సదుపాయం, పీజీ కళాశాల, ఆస్పత్రి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.