Bandi Sanjay And KTR: రాజకీయాల్లో వారిద్దరూ ఎప్పుటూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. వారిద్దరూ ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటివేమీ ఉండవని.. వారి మధ్య నవ్వుల, పువ్వులు పూస్తాయని తాజాగా జరిగిన ఘటనతో వెల్లడి అయింది.
వరదల కారణంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను పరామర్శించి.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గ ఎంపీ బండి సంజయ్ కావడం.. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉండటంతో ఆర్మీ హెలికాఫ్టర్లను కూడా పిలిపించి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నారు. ఆయన కూడా నియోజకవర్గ పరిస్థితిని పరిశీలించేందుకు సిరిసిల్ల వెళ్లారు. అక్కడ వాగులో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్ల ద్వారా రక్షించారు. ఆ తర్వాత వారు వెళ్లిపోయే ముందు ఎదురెదురుగా వచ్చారు. ఇద్దరూ కలవరేమో కానీ అనుకున్నారు. కానీ.. కారుకు అటు వైపు వెళ్తున్న కేటీఆర్.. ఇటు వైపున ఉన్న బండి సంజయ్ ను ప్రత్యేకంగా వచ్చి కలశారు. కరచాలనం చేశారు.
ఇద్దరూ కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. బాగా కష్టపడుతున్నారని బండి సంజయ్ ను కేటీఆర్ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది.
మాముులుగా అయితే కేటీఆర్ ప్రస్తావన వస్తేనే బండి సంజయ్ మండిపడతారు. తన తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారని కేటీఆర్ కు తన స్థాయి లేదని అంటారు. బండి సంజయ్ ను కూడా కేటీఆర్ ఎద్దేవా చేస్తారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా ఏమీ తెలియదంటారు. వీరిద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం అలాంటిది. కానీ అదంతా రాజకీయమేనని తాజా కరచాలనంతో నిరూపించారు.
రాజకీయాలు గతంలోలా రాజకీయాల్లానే చూసేవారు. వ్య్కతిగతంగా వెళ్లేవారు కాదు. కానీ కొంత కాలంగా రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులు చూసేలా రాజకీయాలు మారాయి. అందుకే వీరి షేక్ హ్యాండ్ వైరల్ అయింది. రాజకీయంగా ఎలా తిట్టుకున్నా.. వ్యక్తిగతంగా ఇలా ఉండటం మంచిదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.