Telangana Flood Situation :వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలంటూ అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి సీతక్క. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పరిస్దితిని సమీక్షించారు. జిల్లాలోని అధికారులతో ఫోన్ లో మాట్లతూ వరద ప్రభావం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఏ ఏ మండలాల్లో నష్టం ఎక్కువగా ఉందో అక్కడకు సాధ్యమైన త్వరగా చేరుకోవడంతోపాటు ఇళ్లలోకిి నీరు చేరిన చోట జేసీబిల సహాయంతో ఇళ్లలో చేరిన వరద నీటిని బయటకు పంపేలా చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయే పరిస్థితి ఉంటే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు, బాధితులకు మనోధైర్యం చెప్పాలని సూచించారు.

వాగులు పొంగుతున్న ప్రాంతాల్లో ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం అప్రమత్తంగా ఉండటంతోపాటు సమీపంలో ప్రజలకు ముందస్తు సమాచారం ఇస్తూ, అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. చెరువులకు వరద ప్రభావం ఎప్పటికప్పుడు పరిశీలిచడంతోపాటు చెరువు కట్టలు తెగే అవకాశం ఉంటే ముందుగానే సమీపంలోని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.

వాట్సప్ లో వాయిస్ మెసేజ్ లు పంపండి..

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాయిస్ మేసేజ్‌లు చేయాలంటూ ఆదేశించారు . జిల్లా వ్యాప్తంగా ఏ ఏ గ్రామాలలో ముంపు తీవ్రత ఎక్కవగా ఉంటుందో ముందుగానే గుర్తించి, ఆ గ్రామాలను ప్రజలను వాయిస్ మెసేజ్‌లు పంపడం ద్వాారా ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అధికారులంతా వాట్సప్‌లో వాయిస్ మెసేజ్‌ల ద్వారా కిందిస్థాయి అధికారులకు అక్కడి నుంచి ఎప్పటికప్పుడు గ్రామాల‌్లో ప్రజలను వరద తీవ్రతపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తడిసిన ఇళ్లలో ఎవరూ ఉండొద్దని వాయిస్ మెసేజ్‌ల ద్వారా గ్రామ గ్రామాలకు వాట్సప్ సందేశాలు చేరేలా చూడాలన్నారు మంత్రి  సీతక్క. విద్యుత్ శాఖ అధికారులు సైతం ఈదురు గాలలకు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతోపాటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ షాక్ ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

తాగునీటికి సమస్య తలెత్తకుండా ముందుగానే నిర్వాసితులకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచాలని మంత్రి సీతక్క ఆదేశించారు. 500 మందికిపైగా నిర్వాసితులు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి మంచి ఆహారం, తాగునీరు అందించాలని తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులు వరద నష్టంపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలి, ధ్వంసమైన రహాదారుల వివరాలు , జరిగిన నష్టం అంచనా వేయాలి.వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎలాంటి అప్రమత్తత లోపం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో శానిటేషన్ పనులు వేగవంతం చేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు.

అధికార యంత్రాంగం మొత్తం 24 గంటలు అందుబాటులో ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ డిఆర్ ఎఫ్, ఎన్ డిఆర్ ఎఫ్ ,అగ్నిమాపక , పోలీస్ టీమ్ లతోపాటు అన్ని విభాగాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయంతో పనిచేయాలని, జలదిగ్భందంలో ఉన్న గ్రామాల ప్రజలను సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు మంత్రి సీతక్క.