Nindu Manasulu Serial Today Episode ప్రేరణ కోచింగ్‌కి వెళ్లాలని బయటకు వచ్చే సరికి సిద్ధూ గేటు ముందు బైక్‌తో వచ్చి ఉంటాడు. ప్రేరణని చూసి హాయ్ అంటాడు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగితే లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చానని అంటాడు. నాకేం అవసరం లేదు అని ప్రేరణ సీరియస్ లుక్ ఇస్తే మీరు ఎంత సీరియస్ లుక్ ఇచ్చినా నేను సిన్సియర్‌గా మీకు లిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా అని చెప్తాడు.
సిద్ధూ ప్రేరణతో ఇద్దరం ఒకే దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాం కదా వేరు వేరుగా ఎందుకు ఇద్దరం కలిసే వెళ్తే బెటర్ అని అంటాడు. దానికి ప్రేరణ ఏంటి కలిసి వెళ్లేది నీ పిచ్చి ఆలోచనలకు బ్రేక్ వేయ్ అని సిద్ధూ తనని ట్రై చేస్తున్నాడని అనుకొని అంటుంది. దానికి సిద్ధూ మేడం నాకు అలాంటి ఆలోచన లేదు తమరికి అంత సీన్ లేదు.. ఏదో ఆడపిల్ల రోజు పడుతూ లేస్తూ వెళ్తుంది తోచిన సాయం చేద్దాం అనుకుంటే ఏదేదో ఆలోచించేస్తున్నావ్ అంటాడు. నువ్వు ఎవర్రా నా కోసం ఆలోచించడానికి అని ప్రేరణ అంటే నువ్వు ఎవరు నా కోసం ఆలోచించి సార్‌కి చెప్పావ్ అంటాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో వచ్చే జన్మకి అయినా మిస్ అండర్ స్టాండ్‌గా కాకుండా అండర్ స్టాండింగ్ అమ్మాయిలా పుడతావు అంటాడు. నీ సాయం నాకు వద్దు అని ప్రేరణ అంటే ఒక్క సారి రుణపడిపోయినందుకు ఇంత దూరం వచ్చా ఇంకా రుణపడిపోతే ఇంకెంత దూరం వెళ్తానో అంటాడు.
ప్రేరణ ఎంతకీ రాను అని చెప్పడంతో నేను వెళ్లిపోతా మేడం మీరు లేట్ అయితే నేను కోచింగ్ సెంటర్ లోపల మీరు బయట అంటాడు. బైక్ ఎక్కమని చెప్పడంతో ప్రేరణ ఎక్కుతుంది. ఇక ఐశ్వర్య రంజిత్‌ని ఫాలో అవ్వాలి అనుకొని మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏమైనా జాబ్ వస్తుందేమో కనుక్కొని వస్తా అంటుంది. ఇందిర సవతి ఇంటికి పని మనిషిగా వెళ్లాలి అనుకొని కంగారుగా మాట్లాడుతుంది. ఐశ్వర్య అడిగితే ఏం లేదు అని కవర్ చేస్తుంది. ఇక ఐశ్వర్య రంజిత్ కారు బ్యాక్ సీట్‌లో దాక్కుంటుంది. రంజిత్‌కి అనుమానం వచ్చి చూస్తాడు కానీ ఐశ్వర్య దాక్కుంటుంది.
ప్రేరణ, సిద్ధూ బైక్ మీద వెళ్లడం విజయానంద్ చూసి షాక్ అయిపోతాడు. పీఏ విజయానంద్‌తో బాబు బైక్ మీద బాపు బొమ్మ సార్ అంటాడు. విజయానంద్ కోపంతో విశ్వాసాన్ని ఒక్కటి కొడతాడు. వాళ్లిద్దరికీ అస్సలు పడదు అన్నావ్ కలిసి వెళ్తున్నారు అని అన్న విజయానంద్ తనకు అనుకూలంగా ఓ మాట చెప్పు అంటే దానికి విశ్వాసం శత్రువు శత్రువు ఏకం అయ్యారు అంటే మీకు శతకోపం పెట్టడానికే అంటాడు. విజయానంద్ నవ్వుతూ ఇద్దరి మీద ఓ కన్నేసి ఉంచమని అంటాడు. ఇక సిద్ధూ ప్రేరణలు వెళ్తుంటే బైక్ పంక్షర్ అయిపోతుంది. ప్రేరణ గోల గోల చేస్తుంది.
ఈశ్వరి ఇంటికి ఇందిర వెళ్తుంది. ఈశ్వరి తన భర్తని చూసుకోవాలని చెప్పి సెలవులు ఇవ్వను అని అంటుంది. ఇందిర సరే అంటుంది. తన భర్తకి సూప్ తాగించమని పంపుతుంది. ఇందిర భర్తని చూసి ఏడుస్తుంది. మిమల్ని చూసుకోవడానికి పని మనిషిగా వచ్చానండీ.. పిల్లలు మీ కోసం ఎదురు చూస్తున్నారు.. మిమల్ని నేను ఇక చూసుకుంటాను. నా భర్తగా మన పిల్లలకు తండ్రిగా మీరు వచ్చే వరకు మిమల్ని వదిలి వెళ్లను అండీ ఏడుస్తుంది. రాజశేఖరం కళ్లలో కూడా నీరు వస్తాయి. ఇందిర తుడిచి ఆకలిగా ఉందా అని సూప్ తాగిస్తుంది.
రంజిత్ రిటైర్డ్ ఐఏఎస్ విశ్వనాథ్ ఇంటికి వస్తారు. విశ్వనాథ్ ఆయన భార్య మహాలక్ష్మీ ఇద్దరూ రంజిత్‌ని చూసిషాక్ అయిపోతారు. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావ్ అని విశ్వానాథ్ అడిగితే మిమల్ని చూడటానికి వచ్చానని అంటాడు రంజిత్.. మేం ఇలా ఉన్నాం.. నువ్వు చేసిన గాయం ఇంకా పోలేదు. చావు రాక బతకలేక నరకం అనుభవిస్తున్నాం అని విశ్వనాథ్ అంటే సారీ చెప్తాడు రంజిత్. సారీ చెప్పే అంత చిన్న తప్పు కాదు.. జీవితాలు అతలాకుతలం చేసేశావ్ గతం నుంచి ఎవరూ తేరుకోలేదు.. నిన్ను ఎవరూ రమ్మని చెప్పలేదు.. నువ్వు ఇక్కడికి వస్తే మా బాధ రెట్టింపు అవుతుంది. అది గుర్తుంచుకో వెళ్లిపో అని అంటారు. రంజిత్ బయటకు వెళ్లిపోతుంటే విశ్వనాథ్ రంజిత్ తెచ్చిన ఫ్రూట్స్ విసిరేస్తారు. రంజిత్ వాటికి తీసుకుంటాడు. ఐశ్వర్య చూసి అతను విసిరేశాడు ఇతను తీసుకుంటున్నాడు..ఇతనికి ఆ ఫ్యామిలీకి ఏంటి సంబంధం అని అనుకుంటుంది. రంజిత్ ఫ్రూట్స్ తీసుకొని అక్కడ పెట్టి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.