హిందూ జాతరలను సీఎం కేసీఆర్ పట్టించు కోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు. అదే సమయంలో నిజాం వారసుల మృతదేహాలను స్వాగతిస్తున్నారని, సకల మర్యాదలు ఇస్తున్నారని అన్నారు. హిందువుగా పుట్టడం అదృష్టం అని, పూర్వ జన్మ సుకృతం అని బండి సంజయ్ అన్నారు. సెలబ్రిటీలు చనిపోతే వెళతారు కానీ, గిరిజన ప్రాంతాల్లో పర్యటించబోరని, పోడు భూములకు పట్టాలివ్వరని అన్నారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన నిజాం వారసుడు పరాయి దేశంలో చనిపోతే హైదరాబాద్ కు తీసుకొచ్చి అత్యున్నత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న కేసీఆర్ ఆదివాసీలను ఎందుకు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు.
గతంలో పోడు భూములు సాగుచేసుకొనే రైతులకు కుర్చీ వేసుకుని పట్టాలిప్పిస్తా అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అటవీశాఖ అధికారులను పంపి కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. ఆదివారం (జనవరి 22) కేస్లాపూర్ నాగోబా జాతర సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ జాతరకు ఆయన కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కలిసి హాజరయ్యారు.
ఇదే కేసీఆర్ కు ఆఖరి అవకాశం అని, బడ్జెట్ లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించాలని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన అని అన్నారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కుట్ర చేశారని గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు.
ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తామని అన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కలిసి నాగోబా జాతరకు వచ్చిన బండి సంజయ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. మెస్రం వంశం పక్షాన బండి సంజయ్ కు, అర్జున్ ముండాకు ఆదివాసీలు స్వాగతం పలికారు. బండి సంజయ్ రాకతో నాగోబా జాతరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా జాతర దర్బార్ కు హాజరై ఆదివాసీలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందరికీ నాగోబా జాతర శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ దివాళా పార్టీ
టీఆర్ఎస్ పార్టీ దివాళ తీసిన కంపెనీ అని, అందుకే బీఆర్ఎస్‌గా మార్చారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాని ప్రజలను కోరారు. అధికారంలోకి వచ్చాక అన్ని జాతరలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. పేదలందరికి ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ నాగోబా జాతరకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆదివాసులే అటవీప్రాంత యజమానులని చెప్పారు. అటవీ చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. నాగోబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని అర్జున్ ముండా చెప్పారు.