Team India captain Rohit Sharma: వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు కేవలం 108 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకం సాధించాడు. అలాగే మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలతో సమానంగా ఉన్న ఒక రికార్డును అందుకున్నాడు.
కివీస్ తో రెండో వన్డేలో అర్ధశతకంతో అలరించిన రోహిత్ శర్మ.. ధోనీ, కోహ్లీల సరసన చేరాడు. ఈ ముగ్గురూ కెప్టెన్లుగా వన్డే ఫార్మాట్ లో వెయ్యి పరుగులు చేయటంతోపాటు 50 కన్నా ఎక్కువ సగటును కలిగి ఉన్నారు. వన్డేల్లో వెయ్యి పరుగులు, 50 కన్నా ఎక్కువ సగటు ఉన్న కెప్టెన్లుగా ధోనీ, కోహ్లీ, రోహిత్ రికార్డ్ నెలకొల్పారు. రోహిత్ వన్డే ప్రదర్శనను పరిశీలిస్తే.. ఇప్పటివరకు 240 మ్యాచ్ లు ఆడిన హిట్ మ్యాన్ 9681 పరుగులు చేశాడు . అందులో 29 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ జంప్
రాయ్‌పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా భారత జట్టు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో విజయం సాధించడంతో భారత జట్టు మూడో ర్యాంక్‌కు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్ నంబర్ వన్ కిరీటం కోల్పోయింది.
భారత జట్టు వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ( ICC ODI Rankings )లో నంబర్ వన్ జట్టుగా అవతరిస్తుంది . ఈ రెండు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత జట్టు వన్డేల్లో నంబర్‌వన్‌గా అవతరిస్తుంది, లేకపోతే ఆ అవకాశం ఉండదు.