Sunil Gavaskar On Shubman Gill: భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో చాలా ఆకట్టుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. శుభమాన్ గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ ఘనత సాధించారు.


అదే సమయంలో ఈ యువ ఆటగాడు తన బ్యాటింగ్‌తో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ను బాగా ఆకట్టుకున్నాడు. సునీల్ గవాస్కర్ కామెంటరీలో ఉన్న సమయంలో టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ను తరచుగా ప్రశంసించాడు.


న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా సునీల్ గవాస్కర్ శుభ్‌మన్ గిల్‌కు ఒక పేరు పెట్టాడు. హైదరాబాద్ వన్డే మ్యాచ్‌లో వ్యాఖ్యానిస్తున్న సమయంలో సునీల్ గవాస్కర్ శుభ్‌మన్ గిల్‌కు 'స్మూత్‌మన్ గిల్' అనే పేరును ఇచ్చాడు. హైదరాబాద్ వన్డే తర్వాత సునీల్ గవాస్కర్ ‘నేను మీకు కొత్త మారుపేరు పెట్టాను’ అని శుభమాన్ గిల్‌తో చెప్పాడు. దీని తర్వాత శుభమాన్ గిల్ ముఖంలో చిరునవ్వు మెరిసింది. అలాగే ఈ పేరు తనకు నచ్చిందని యువ ఓపెనర్ తెలిపాడు.


హైదరాబాద్ వన్డేలో శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించి భారీ రికార్డు సృష్టించాడు.


డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 23 ఏళ్ల 132 రోజుల్లో శుభ్‌మన్ ఈ ఘనత సాధించాడు. అతనికి ముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 24 ఏళ్ల 145 రోజుల వయసులో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మూడో స్థానంలో ఉంది.


ఈ అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాక తనపై జట్టు సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. 'అద్భుతం', 'అవుట్ ఆఫ్ ది వరల్డ్', 'చాబుక్', 'ప్యూర్ క్లాస్', 'ట్రీట్ టు వాచ్'... ఇవీ భారత క్రికెట్ జట్టు సభ్యులు శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీని వర్ణించడానికి ఉపయోగించిన పదాలు. 


మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ కు డ్రెస్సింగ్ రూమ్ లో ఘన స్వాగతం లభించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది గిల్ చేత కేక్ కట్ చేయించారు. అతని స్పెషల్ ఇన్నింగ్స్ కు గుర్తుగా స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అలాగే జట్టు సహచరులు అతని ఇన్నింగ్స్ గురించి మాట్లాడారు.


'నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్సుల్లో ఇది ఒకటి. అతను డబుల్ సెంచరీ అందుకోకపోయినా ఇది ఉత్తమ ఇన్నింగ్సుల్లో ఒకటిగా నిలిచేది. అతను ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగా నేను ఉద్వేగానికి లోనవను. అయితే గిల్ ఇన్నింగ్స్ చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి.' అని భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు.