B R Ambedkar Jayanti 2023: కుల వివక్ష వెంటాడినా వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేద్కర్: కేసీఆర్

B R Ambedkar Jayanti 2023: ఆత్మన్యూనతకు, దుర్భలత్వానికి గురయ్యే ఆలోచనల్లో కూరుకుపోకుండా, గొప్పగా ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ అని సిఎం కేసీఆర్ అన్నారు.

Continues below advertisement

B R Ambedkar Jayanti 2023:కష్టం తో కూడుకున్న ఎంతటి సుధీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే  గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో వారు పోషించిన పాత్రను, జాతికి అందించిన సేవలను  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు డా. బిఆర్ అంబేద్కర్ అని సిఎం కొనియాడారు.

Continues below advertisement

గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్- KCR

ఆత్మన్యూనతకు, దుర్భలత్వానికి గురయ్యే ఆలోచనల్లో కూరుకుపోకుండా, గొప్పగా ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ అని సిఎం అన్నారు. సమాజంలో నెలకొన్న అజ్జానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ అని సిఎం కేసీఆర్ అన్నారు. సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టిన అంబేద్కర్ .. ప్రజాస్వామ్యం, వర్ణ నిర్మూలన, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక సంస్కరణలు, చరిత్ర, ఆర్థికవ్యవస్థ తో పాటు  అనేక అంశాలపై ఆయన చేసిన రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపచేశాయని సీఎం అన్నారు. అసమానతలు లేని, ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు,  సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చి, నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ తన మేధస్సుతో మదించి సమకూర్చినవేనని సీఎం పేర్కొన్నారు.

125 అడుగుల అంబేద్కర్ దేశానికే గర్వకారణం- KCR

ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఆయన జయంతి రోజున  రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టించడం తెలంగాణ రాష్ట్రానికే  కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ను పొందుపరిచిన తెలంగాణ బాంధవునికి తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళిగా సిఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా దేశంలోనే మరెక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు పెట్టి  అంబేద్కర్ ను సమున్నతంగా గౌరవించుకున్నామని సీఎం తెలిపారు.

దళితబంధు స్కీం దేశ చరిత్రలోనే విప్లవాత్మక పథకం- KCR

అన్ని పథకాలతో పాటు సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని సిఎం అన్నారు. దళితుల కోసం గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతి నిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో టిఎస్ ప్రైడ్,  దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. అన్ని వర్గాలకు అందుతున్న పథకాలతో పాటు, దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా, వారికోసం ప్రత్యేకంగా తెచ్చిన తెలంగాణ దళితబంధు పథకం దేశ చరిత్రలోనే విప్లవాత్మక పథకంగా మారిందన్నారు.

దశాబ్దాలుగా ఆత్మన్యూనతతో అసంఘటితంగా వున్న ఎస్సీ కుల సమాజం..దళితబంధు పథకంతో సమిష్టిగా, సంఘటితమౌతూ, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని సిఎం అన్నారు. ఇప్పటికే దళితబంధు పథకం లబ్ధి దారులు వారి వ్యాపారాల్లో సాధిస్తున్న విజయగాథలను తెలుసుకుంటుంటే తనకు ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నదని సీఎం అన్నారు. అదే సందర్భంలో రాష్ట్రంలోని సబ్బండ కులాలకు, మహిళలు, పేద వర్గాలకు అవసరమైన అందరికీ అన్ని రకాలుగా ఆసరాను అందిస్తూ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని సిఎం తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో దేశంలో దళిత సకల జనుల సంక్షేమానికి తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సిఎం పునరుద్ఘాటించారు.

Continues below advertisement
Sponsored Links by Taboola