Azharuddin will Jubilee Hills Candidate: జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం రేసు గట్టిగానే జరుగుతోంది. అయితే ఈ రేసులో అజహరుద్దీన్ ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ తో పరిచయాలు ఉండటంతో అక్కడి నుంచే తన పేరును ఖరారు చేసుకుంటున్నారు. మంగళవారం సోనియాతో పాటు రాహుల్ గాంధీతోనూ అజహరుద్దీన్ సమావేశం అయ్యారు. సోనియా సాధారణంగా పార్టీ నేతలకు అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు. కానీ అజహరుద్దీన్ కు ఇచ్చారు. ఫోటోలు దిగారు. రాహుల్ గాంధీ కూడా అజహర్‌తో మాట్లాడారు. మర్యాదపూర్వకంగా కలిసిన అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ అంశంపై హామీ పొంది ఉంటారని భావిస్తున్నారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ లో నుంచి మహ్మద్ అజహరుద్దీన్ పోటీ చేశారు. టిక్కెట్ ను చివరి క్షణంలో ఖరారు చేయడంతో పదహారు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చివరి క్షణంలో టిక్కెట్ కేటాయించినా గట్టి పోటీ ఇచ్చానని ఈ సారి తాను విజయం సాధిస్తానని అజహరుద్దీన్ అంటున్నారు. ఇటీవల ఆయన తానే పోటీ చేస్తానని ప్రకటించారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్ సైట్ల లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణు గోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. దానికి తగ్గట్లుగానే హైకమాండ్ తో అజహర్ భేటీ అయ్యారు.
జూబ్లిహిల్స్ టిక్కెట్ రేసులో నాంపల్లీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, ఇర్ఫాన్ అజీజ్, ఫహీమ్ కురేషీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. మైనార్టీ ఎమ్మెల్యే కూడా లేరు. జూబ్లిహిల్స్ నుంచి మైనార్టీ నేతకే చాన్స్ ఇవ్వనున్నారు. ఈ సారి మజ్లిస్ మద్దతు కూడా లభించడం ఖాయం కావడంతో ఇక్కడ గెలిచే వారికి మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు. అందుకే పోటీ మరింత తీవ్రంగా ఉంది. ఈ పోటీలో హైకమాండ్ తో ఉన్న పరిచయాలతో అజహద్దీన్ ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఆయన వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున పార్టీ నేతలు పని ప్రారంభించారు. ఇంచార్జుల్ని నియమించారు. ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయి లో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు.