Mahatma Gandhi refused to salute Indian Flag | ప్రతి ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈసారి దేశ ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పొందిన ఆ రోజు దేశ ప్రజలందరికీ చాలా ప్రత్యేకమైనది. భారత దేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమానికి సంబంధించి అనేక కీలక సంఘటనలు ఉన్నాయి. అందులో ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశ జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకానికి (Indian National Flag) సెల్యూట్ చేయడానికి నిరాకరించారు. మహాత్మా గాంధీ అలా ఎందుకు చేశారు, దాని వెనుక కారణం వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. త్రివర్ణ పతాకంపై వివాదం
భారతదేశ జాతీయ జెండా మువ్వన్నెల పతాకం నేడు మన గౌరవం, గర్వానికి చిహ్నం. ఇందులో 3 రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ ఉన్నాయి. మధ్యలో ఉన్న అశోక చక్రం దేశ ఐక్యత, శాంతితో పాటు ప్రగతికి చిహ్నంగా ఉంది. అయితే, భారత స్వాతంత్య్రోద్యమ సమయంలో జాతీయ పతాకంపై పెద్ద వివాదం జరిగిందని మీకు తెలుసా. మహాత్మా గాంధీ స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా గాంధీజీ 1931లో త్రివర్ణ పతాకం (Indian Flag) రూపకల్పనకు తన ఆమోదం తెలిపారు. ఆ తరువాతే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
త్రివర్ణ పతాకంలో మార్పుతో గాంధీజీ అసంతృప్తి
కానీ రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకం రూపకల్పనలో మార్పులు చేయాలని 1947లో నిర్ణయించింది. తెలుగువారైన పింగళి వెంకయ్య రూపొందించిన కొత్త త్రివర్ణ పతాకంలో చరఖా స్థానంలో అశోకుడి ధర్మ చక్రాన్ని చేర్చారు. స్వదేశీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చరఖాను తొలగించి ఆ స్థానంలో అశోక చక్రం చేర్చడం మామూలు విషయం కాదని.. ఈ మార్పుతో గాంధీజీ చాలా బాధపడ్డారు. ఆ సమయంలో ఆయన లాహోర్‌లో ఉన్నారు. రాజ్యాంగ సభలోని కొంతమంది కాంగ్రెసేతర సభ్యులు చరఖా కాంగ్రెస్ పార్టీకి చిహ్నమని, దీన్ని జాతీయ జెండాలో చేర్చడం సముచితం కాదని వాదించారు. దాంతో గాంధీజీ ఈ మార్పుపై బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గాంధీజీ ప్రకారం చరఖా అర్థం
త్రివర్ణ పతాకంలో మార్పులు జరిగిన సమయంలో మహాత్మా గాంధీ మాట్లాడుతూ, 'చరఖా లేని ఈ జెండాకు నేను సెల్యూట్ చేయను' అని చెప్పడంతో అంతా షాకయ్యారు. చరఖా కేవలం నూలు వడికే పరికరం మాత్రమే కాదన్నారు ఇది ఎందరో పేదలకు ఉపాధి, ఆదాయాన్ని అందించడమే కాకుండా మానవత్వం, సరళతకు చిహ్నంగా భావించారు. ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే కాకుండా పేద, ధనికుల మధ్య విడదీయరాని బంధానికి చిహ్నంగా ఉందని’ గాంధీ నమ్మారు. అయితే, అశోక చక్రం కూడా అహింస, ధర్మానికి చిహ్నమని, ఇది భారతదేశ పురాతన సంస్కృతిని సూచిస్తుందని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి గాంధీజీకి వివరించారు. చివరికి, గాంధీజీ ఈ కొత్త డిజైన్‌కు ఒప్పుకున్నారు. జూలై 22, 1947న, రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా ఆమోదించింది. ఆగస్టు 15, 1947న ఇది స్వతంత్ర భారతదేశంలో ఇదే జెండాను ఎగురవేశారు.