Pulivendula ZPTC by elections:  అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధాన పార్టీలు తీసుకున్న  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉపఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య జరుగుతోంది. పులివెందులలో ఉన్న పదిహేను పోలింగ్ బూత్‌లు అత్యంత సమస్యాత్మకం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కారణంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొంత మంది తమను ఓట్లు వేయనివ్వడం లేదని ఆరోపించారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. పలు బూత్‌లలో ఓటర్లు ఉదయమే వచ్చి బారులు తీరారు. మద్యాహ్నానికి యాభై శాతం వరకూ పోలింగ్ జరిగింది. సాయంత్రానికి ఎనభై నుంచి 90 శాతం వరకూ పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు 

ప్రధాన పార్టీల కీలక నేతలెవరూ పోలింగ్ స్టేషన్ల వద్దకు పోకుండా ముందస్తుగా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఒంటి మిట్టలోనూ పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నానికి యాభై శాతం వరకూ పోలింగ్ నమోదు అయింది.  పులివెందులలతో పోలిస్తే ఒంటిమిట్టలో రెట్టింపు ఓటర్లు ఉన్నారు. పాతిక వేల మంది వరకూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అక్కడ కూడా ఓటర్లు బారులు తీరారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ చేస్తున్నారని రెండు వైపులా ఆరోపించుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. 

అయితే పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలింగ్ నిర్వహణపై అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. తమ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఓ సారి, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకు వచ్చి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పట్టణాల్లో దొంగ ఓటర్లను గుర్తు పట్టడం కష్టం కానీ.. పల్లెల్లో అయితే దొంగ ఓటర్లు ఎవరో.. తమ ఊరివాళ్లు ఎవరో ఏజెంట్లు సులువుగా గుర్తు పట్టేస్తారు. వైఎస్ార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఉన్నారు. స్థానికేతరులు ఆయా గ్రామాల్లోకి వచ్చి ఓట్లేసే పరిస్థితి ఉండదని వైసీపీ నేతలు ఓటమి భయంతోనే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు కడప ఎస్పీ అశోక్ కుమార్ కూడా పులివెందుల,  ఒంటిమిట్టల్లోనే పోలింగ్ ను పర్యవేక్షిస్తూ ఉన్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ మధ్యాహ్నం సమయంలో.. పులివెందులలో వైసీపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఆయన అవినాష్ రెడ్డితో మాట్లాడారు. పులివెందులలో పోలింగ్ విషయంలో శాంతిభద్రతల సమస్యలు రాకుండా , అనుచరులను అదుపులోకి ఉంచాలని కోయ ప్రవీణ్..  అవినాష్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది. 

మరో వైపు పోలింగ్ లో అక్రమాలు అంటూ.. విజయవాడలోని ఎస్‌ఈసీ ఆఫీసు ఎదుట వైసీపీ నాయకులు ధర్నా చేశారు.  ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ చూడలేదని అంబటి రాంబాబు ఆరోపించారు.