Assembly Elections 2023: నవంబర్ 9న సీఎం కేసీఆర్ నామినేషన్, వేసేముందు ఆ సెంటిమెంట్ ఆలయంలో పూజలు

Assembly Elections 2023: నవంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పోటీ చేసే కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాలకు అదే రోజు నామినేషన్ వేస్తారు.

Continues below advertisement

Assembly Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు అయింది. వచ్చే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ సెగ్మెంట్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆ రెండు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీలోకి దిగేందుకు కేసీఆర్ నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తం ఖారారు చేసుకున్నారు. నవంబర్ 9న ఆ రెండు నియోజకవర్గాల నుంచి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాను సెంటిమెంట్ ఆలయంగా నమ్మే కోనాయపల్లి వెంకటేశ్వరస్వారి ఆలయంలో పూజల అనంతరం కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.

Continues below advertisement

ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఈ నెల 15 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 15న హుస్నాబాద్, 16న జనగామ, భువనగిరిలో సభలు నిర్వహించనున్నారు. ఇక 17న సిద్దిపేట, సిరిసిల్ల.. 18న జడ్చర్ల, మేడ్చల్‌లో సభలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు బీఫారాలు అందించడంతో పాటు ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు.

15వ తేదీనే కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలకు పోటీగా ప్రజలను ఆకట్టుకునేలా బీఆర్ఎస్ పలు కీలక హామీలు ఇవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై కసరత్తు జరుగుతోంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా అద్బుతమైన పథకాలు ఉంటాయని ఇటీవల బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై మంత్రి హరీష్ రావు హింట్ ఇచ్చారు. మహిళలకు త్వరలోనే గుడ్ న్యూస్ అందుతుందని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కీలక హామీలు ఉంటాయని స్పష్టమవుతుంది. మరోవైపు ఇప్పటినుంచే బీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. కేసీఆర్ వైరల్ ఫీవర్ వల్ల ప్రగతిభవన్‌కే పరిమితమవ్వగా.. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

హరీష్, కేటీఆర్ వరుస సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గత 9  ఏళ్లల్లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది గురించి ప్రజలకు వివరిస్తున్నారు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై విమర్శలు చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదని బీజేపీపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. సభలలో వారిద్దరు చేసే కామెంట్స్ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రేపటి నుంచి పార్టీల మధ్య మాటల వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ కూడా ఈ నెల 15వ తేదీ నుంచి బస్సు యాత్రకు రెడీ అవుతుంది. 10వ తేదీన గాంధీ భవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర జరగనుండగా.. మూడు రోజుల పాటు ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. ఇక బీజేపీ కూడా 15వ తేదీ నుంచి బహిరంగ సభలకు సిద్దమవుతోంది. 

Continues below advertisement