ఇజ్రాయెల్ లో హమాస్ ఉగ్రవాదులు నరమేథం సృష్టిస్తున్నారు. నడిరోడ్డుపైనే నిర్దాక్షిణ్యంగా పౌరులను కాల్చేస్తూ వికృతంగా ప్రవర్తిస్తున్నారు. వారి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దక్షిణ ఇజ్రాయెల్ లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దక్షిణ ఇజ్రాయెల్ లో ఉగ్రవాదులు తన ఇంట్లోకి రావడాన్ని గమనించిన ఓ వ్యక్తి వెంటనే అప్రమత్తమై తన కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. కిటికీ నుంచి తన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను వేగంగా బయటకు పంపించాడు. చివరకు తాను బయటకు వస్తున్న క్రమంలో ఉగ్ర తూటాలకు బలయ్యాడు. 


అప్పటికే ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు అతనిపై కాల్పుల వర్షం కురిపించారు. దీంతో అతడు ఆ కిటికీ వద్దే ప్రాణాలు కోల్పోయాడు. సీసీ టీవీలో రికార్డైన ఈ దృశ్యాలను ఆ దేశ జర్నలిస్ట్ హనన్య నఫ్తాలీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఆయన నిజమైన హీరో అని కొనియాడారు. అయితే, అతని కుటుంబం ప్రస్తుతం క్షేమంగా ఉందా లేదా..? అన్నది తెలియలేదు. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా ఇది ఘోరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






మ్యూజిక్ ఫెస్ట్ లో నరమేథం


హమాస్ ముష్కరుల మరో దురాగతం సైతం వెలుగులోకి వచ్చింది. అప్పటివరకూ ఉల్లాసంగా సాగుతున్న ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో ఆకాశం నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకెట్లు వందల కొద్దీ ప్రాణాలను బలిగొన్నాయి. మరోవైపు ముష్కరులు సైతం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఒక్క మ్యూజిక్ ఫెస్టివల్ లోనే 260 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. 


విదేశీయుల అపహరణ


ఈ పార్టీలో ఉన్న విదేశీయులను సైతం ముష్కరులు దారుణంగా హతమార్చారు. దాదాపు 100 మందికి పైగా విదేశీయులను కిడ్నాప్ చేసినట్లు తాజాగా హమాస్ ప్రకటించింది. హై ర్యాంకింగ్ అధికారులు తమ వద్ద ఉన్నట్లు పేర్కొంది. వీరిలో నేపాల్, థాయ్ లాండ్ కు చెందిన పలువురు ఉన్నారు. 


ఇజ్రాయెల్ ప్రతిదాడి


హమాస్ మిలిటెంట్లపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. దక్షిణ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లపై ప్రతిదాడులను తీవ్రం చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ట్ తెలిపారు. గాజా సరిహద్దు వెంబడి ఊహించని దాని కంటే ఎక్కువ చోట్ల చొరబాట్లు జరిగాయని, వాటిని తిప్పికొట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.