Minister Satyavathi Rathod : పోడు వ్యవసాయ సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులను గుర్తించి పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సర్వే ప్రక్రియను మాసాంతంలోగా నిర్వహించాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి గ్రామ సభ, డివిజన్ సభ, జిల్లా సభలు పూర్తి చేయాలని తెలిపారు. పోడు భూముల సర్వే ప్రక్రియ ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చేపట్టాలని, ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో అర్హులైన వారికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్.  పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని, సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 


గ్రామ సభల్లో తీర్మానం 


ఎట్టి పరిస్థితులలో నూతనంగా అటవీ భూముల ఆక్రమణకు అనుమతించరాదని, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని  తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. పోడు భూముల సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, ధరణి పోర్టల్ ద్వారా 33 మాడ్యుల్స్ లో అందిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 


జిల్లాలో 100 బృందాలు 


ఆసిఫాబాద్‌ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పోడు భూముల పట్టా కోసం వచ్చిన దరఖాస్తులను అటవీ, రెవిన్యూ శాఖల సమన్వయంతో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేస్తూ ఎఫ్. ఆర్. సి. కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  సర్వే ప్రక్రియ నిర్వహణ కోసం ఆసిఫాబాద్‌ జిల్లాలో 100 బృందాలను ఏర్పాటు చేశామని, గ్రామసభలు నిర్వహించి నిబంధన మేరకు తీర్మానాలు చేస్తామన్నారు. సర్వే ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా, సర్వే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా అటవీ అధికారి, ఎస్.పి., జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


4.14 లక్షల క్లెయిమ్స్ 


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.14 లక్షల క్లెయిమ్ లు అందాయని, ఇప్పటికే అధిక శాతం క్లెయిమ్ ల వెరిఫికేషన్ పూర్తి అయ్యిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగొద్దని మంత్రి అధికారులకు సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.  అడవులను సంరక్షించాలనే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు.  అందుకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. పోడు భూములకు సంబంధించి మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను ఒక టీమ్ వర్క్‌తో పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సీసీఎఫ్ దొబ్రియల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీధర్ అధికారులు పాల్గొన్నారు.