Modi AP Tour: విశాఖ నగరంలో సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉన్న బీజేపీ జెండాలను అధికారులు తొలగించారు. అటుగా వెళ్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విషయం గుర్తించి అధికారులను నిలదీశారు. ఇదేంటని ప్రశ్నించగా.. అధికారులు చప్పుడు చేయలేదు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు సంఘటనా స్థలానికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.






టీడీపీ కార్యాలయంలో మెరుపు నిరసన...


సేవ్ స్టీల్ ప్లాంట్ అని రాసి ఉన్న ప్లకార్డులు చేతపట్టుకొని విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిరసన చేపట్టారు. జగన్ సర్కార్ సాయంతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని విశాఖ టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.  ప్రైవేటీకరణను వైసీపీ నిజంగా వ్యతిరేకిస్తే... ప్రధాని దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకు వెళ్ళాలని అన్నారు. ప్రైవేటీకరణను ఆపాలన్నారు. స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ నేతలను అడగండి అంటూ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు భాద్యతారాహిత్యం అన్నారు. ప్రధాని సభలో మూడు రాజధానులపై వైసీపీ స్పష్టత ఇవ్వాలన్నారు. మోడీ సమక్షంలో సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటించాలన్నారు. మూడు రాజధానుల గర్జనలు ప్రధాని ముందు చేసి వైసీపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. 


స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగులు ధర్నా


విశాఖలో ప్రధానమంత్రి పర్యటనతో కూర్మన్నపాలెం వద్ద నిరసన దీక్ష చేస్తోన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మిక సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విభజన హామీల సాధన కోసం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేస్తున్నట్లు మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌గేటు వద్దకు ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. నిరసనలను అడ్డుకునేందుకు, అరెస్టులు చేసేందుకు పోలీసులు సన్నద్ధంగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏ క్షణంలోనైనా ఆందోళకారులు ప్రధాని పర్యటనకు ఆటంకం కలిగిస్తారనే సమాచారంతో భారీగా పోలీసులను మోహరించారు.