నిజాం కాలేజీ విద్యార్థులతో శుక్రవారం (నవంబరు 11) మరోసారి జరిపిన చర్చలు సఫలం అయినట్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించారని, నేటికీ అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) విద్యార్థులను హాస్టల్‌లో ఉంచేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన మంత్రి సబితా 50-50 శాతం డిగ్రీ పీజీ విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పారు. ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి మంత్రి సబిత కూడా ట్వీట్ చేశారు.






గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే మొదటిసారిగా ముఖ్యమంత్రిగారి ఆదేశాలకు అనుగుణంగా డిగ్రీ విద్యార్థినులకు నిజాం కళాశాలలో హాస్టల్ వసతి కల్పించడం జరిగిందని మంత్రి సబిత ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించిందని అన్నారు. అయినా విద్యార్థులు ఆ హామీలకు ఒప్పుకోలేదు. మొత్తం తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన కొనసాగిస్తున్నారు.


అంతకుముందు, హాస్టల్ సమస్య పరిష్కారం కోసం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు జరిపారు. కొత్తగా నిర్మించిన హాస్టల్ లో 50 శాతం పీజీ విద్యార్థినులకు, మరో 50 శాతం యూజీ విద్యార్థినులకు కేటాయిస్తామని నవీన్ మిట్టల్ ప్రతిపాదించారు. దీంతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లి మిగిలిన వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తోటి విద్యార్థినులతో మాట్లాడిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. చర్చలు విఫలం కావడంతో శుక్రవారం మరోసారి నిరసనలు కొనసాగించారు. 


కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లోనే తమకు వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోలేదని చెప్పారు.


కేటీఆర్ స్పందన
నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ కేటాయింపు సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పక్షాన నిలబడి, తక్షణమే సమస్యను పరిష్కరించాలని నవంబర్‌ 8న మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. వెంటనే సమస్యకు ముగింపు పలకాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌కు కేటీఆర్ సూచించారు. వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులతో చర్చలు మొదలుపెట్టారు. గత కొన్ని రోజులుగా మహిళా హాస్టల్‌లో విద్యార్థినులకు వసతి కల్పించాలని కోరుతూ నిజాం కళాశాల విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 


అసలేం జరిగిందంటే? 
నిజాం కాలేజీలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థినులకు కేటాయించాలంటూ గత కొన్ని రోజులు ఆందోళన చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ జోక్యంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు 10 మంది విద్యార్థినులు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో సమావేశమై సమస్యపై చర్చించారు. కానీ, చర్చలు మాత్రం సఫలం కాలేదు.