Nara Lokesh Padayatra : రాజకీయాల్లో పాదయాత్రలు ఓ బెంచ్ మార్క్‌లా మారిపోయాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల్లో ఉండటానికి .,. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడానికి యాత్రలు బాగా ఉపయోగపడుతున్నాయి. తాజాగా తెలుగుదేశం యువ నేత లోకేష్ పాదయాత్రకు ముహుర్తం ఖారారు చేసుకున్నారు. కొంత కాలంగా ఆయన పాదయాత్ర చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది.
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో లోకేష్ పాదయాత్ర
నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం కామన్‌గా మారింది. గతంలో అయితే చంద్రబాబుతో పాటు జగన్ జైలులో ఉండటం వల్ల... షర్మిల పాదయాత్ర చేశారు. కానీ షర్మిల పాదయాత్ర వైసీపీకి విజయం లభించలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేశారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి ఉన్నందున వారానికి ఆరు రోజుల పాదయాత్రే చేశారు. అయినప్పటికీ ఆయన ఘన విజయం సాధించారు.
పార్టీ క్యాడర్ బాగోగులు చూసుకుంటున్న లోకేష్
ఈ సారి చంద్రబాబు తనయుడు లోకేష్ ఒక్కరే ఏపీలో పాదయాత్ర చేయనున్నారు. కుప్పం నుంచి .. ఇచ్చాపురం వరకూ ఏడాదిలో నెలల్లో పాదయాత్ర పూర్తి చేసే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబునాుయుడు వస్తున్నా మీ కోసం పేరుతో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు వయసు 70 ఏళ్లు దాటిపోయినందున పాదయాత్రకు వయసు సహకరించదని.. ఆ బాధ్యతను లోకేష్ తీసుకున్నారని అనుకోవచ్చు. లోకేష్ ఇటీవలి కాలంలో చురుగ్గా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ బాగోగులు మొత్తం ఆయనే పట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజల్లోకి కూడా ఆయనే వెళ్లాలని అనుకుంటున్నారు.
తెలంగాణలో ఇప్పటికే పాదయాత్రల జోరు - ఏపీలోనూ ప్రారంభం
తెలంగాణలో ఇప్పటి బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్రలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సోదరి షర్మిల ఇటీవల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఏపీలో మాత్రం ఇంకా ఎవరూ ఎలాంటి యాత్రలు ప్రారంభించలేదు. లోకేష్ జనవరి 27 నుంచి ప్రారంభిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా యాత్ర చే్యాలనుకుంటున్నారు. కానీ ఆయన చేయాలనుకుంటున్నది.. పాదయాత్ర కాదు.. బస్సు యాత్ర. ఇందు కోసం బస్సు సిద్ధమయింది.. లోకేష్ పాదయాత్రకు కాస్త అటూ ఇటూగా పవన్ బస్సు యాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆయన కూడా రాష్ట్ర మంతటా పర్యటించనున్నారు.