Ashada Masam Bonalu: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు. బోనాల ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. బోనాల నిర్వహణ కోసం ప్రతీ ఏటా దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు సర్కారు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బోనాల పండుగకు ముందే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. 


హైదరాబాద్ లో జూన్ 22వ తేదీ నుంచి ఆషాఢ మాసం బోనాల పండుగ మొదలు కాబోతుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనం తీయడంతో నెల రోజుల పాటు బోనాల జాతర మొదలు కాబోతుంది. ఈ మేరకు శుక్రవారం రోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోనాల జాతర ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. జూన్ 22వ తేదీ గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభం కానుండగా.. జూలై 9వ తేదీన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, ఆ తర్వాతి రోజు అంటే జూలై 10వ తేదీన రంగం ఉంటుంది. ఇక 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు, 17వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం నలుదిక్కులా చాటిందని అన్నారు. బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


బోనాల విశిష్టత చాటేలా...


భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవతలను పూజించేందుకు బోనం ఎత్తే సాంప్రదాయం యావత్ తెలంగాణ అంతటా ఉంది. బోనాలను మహంకాళి బోనాలు, ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు ఇలా రకరకాల దేవతల పేరిట నిర్వహిస్తుంటారు. అదే తరహాలో హైదరాబాద్‌లో లష్కర్ బోనాలు ఏటా జరుగుతుంటాయి. ఈ బోనాల సమయంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుగుతుంది. పండగ నేపథ్యంలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలవుతుంది. బోనమెత్తే మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతుంది. గత ఏడాది ఉజ్జయిని మహాంకాళి బోనాలు జూలై 17వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయాలకు అతీతంగా బోనాల పండగ వైభవంగా జరగనుందని అన్నారు.