Andhra Pradesh Telangana CM Debates : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ(AP Telangana) ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్‌లో ఈ భేటీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు కూడా ఈ కీలక భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు వేంరెడ్డి నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్ రావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థికశాఖ కార్యదర్శి సహా ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం.
అజెండా సిద్ధం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య జరిగే ఈ కీలక భేటీలో పది అంశాల అజెండాను ఇప్పటికే సిద్ధం చేశారు. విభజన సమస్యల పరిష్కారం.. నిధుల కేటాయింపు, నీళ్ల సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లోని సంస్థల అస్తుల పంపకాలపై ఇరువురు సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను కూడా చంద్రబాబు-రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు . తెలంగాణ నుంచి తమకు రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్ల అంశాన్ని చంద్రబాబు ఈ భేటీలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని మూడు భవనాలను తమకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటినుంచో అడుగుతోంది. దీనిపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా సంస్థల విభజన పూర్తి కాకపోవడంతో దానిపైనా ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.