Union Budget 2024-25 Date: ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ RBI గవర్నర్‌తో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఇప్పుడు పూర్తి స్థాయి పద్దుని ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. జులై 23న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించిందని తెలిపారు. 


"కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాష్ట్రపతి ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ని జులై 23న ప్రవేశపెట్టనున్నాం"


- కిరణ్ రిజిజు, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి 






బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు..


ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికలు ఉండడం వల్ల ఈ పద్దుని ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటవడం వల్ల మొత్తం పద్దుని ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఏడోసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టి అరుదైన రికార్డుని సొంతం చేసుకోనున్నారు సీతారామన్. అంతకు ముందు మొరార్జీ దేశాయ్ పేరిట ఈ రికార్డు ఉండగా దీన్ని అధిగమించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌లో తొలిసారి ప్రకటిస్తున్న పద్దు ఇది. ఫలితంగా ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. అంచనాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పైగా ఈ సారి బీజేపీకి మెజార్టీ లేకపోవడమూ మరింత కీలకంగా మారింది. అంచనాలు అందుకునేలా పద్దు ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని చెప్పారు. జూన్ 27న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో తన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


"ప్రభుత్వ ముందు చూపుకి, గొప్ప విధానాలకు ఈ బడ్జెట్‌ ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. ఆర్థికంగా, సామాజికపరంగా కీలక నిర్ణయాలతో పాటు చరిత్రాత్మక అడుగులు వేసే విధంగా ఈ పద్దుని కేంద్రం రూపొందించింది. ఇప్పటి వరకూ ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో అంత కన్నా వేగంగా ఇకపైనా కొనసాగుతుంది. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకుంటుంది"


- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 


Also Read: Viral Video: 2020లో మళ్లీ ట్రంప్‌ని ఓడిస్తా, బైడెన్ వింత వ్యాఖ్యలు - టైమ్ ట్రావెలింగ్ చేస్తారేమో అంటూ నెటిజన్ల సెటైర్లు