AP BJP Meet TS Governer :  తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 3 వల్ల ఉత్తారంధ్ర బీసీలు భారీగా నష్టపోతున్నారని వారికి న్యాయం చేయాలని ఉత్తరాంధ్ర బీజేపీ నేతలు హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసైని కోరారు.  వీరి వెంటే బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన దాదాపుగా పది లక్షల మంది ఉత్తరాంధ్ర బీసీలకు తెలంగాణ సర్కార్ అన్యాయం చేసిందన్నారు.  ఈ జీవో వల్ల వారంతా బీసీ జాబితాలో ఉండలేకపోతున్నారని.. తద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.  జీవో నెంబర్ 3 తో బలహీన వర్గాలు హక్కులు కోల్పోతున్నారని..  విభజన తర్వాత ఆంధ్రలో బీసీలు హక్కులు కోల్పోతున్నారని బీజేపీ నేత మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు.


తెలంగాణ సర్కార్ 2014లోనే జీవో నెంబర్ 3 జారీ చేసింది.  గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న 16 ముఖ్య కులాలను వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితా నుండి తొలగిస్తూ  ఆ జీవోలు ఉత్తర్వులు ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలను మాత్రమే జాబితాలో కొనసా గించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏపీలోని ప్రధాన కులాలకు ప్రభుత్వం అందించే పథకాలు, రాయితీలు అమలు చేయకుండా నిరోధించడానికే ఈ కులాలను బీసీ జాబితానుండి తొలగించారు.  బీసీ జాబితాలో ఉన్న కులాలను తొలగించడంతో ఈ ప్రధాన కులాలకు చెందినవారంతా ఓసీ జాబితా కిందకి వచ్చారు.  తెలంగాణ ప్రాంతంలో గవర, కొప్పుల వెలమ, కాళింగ, తూర్పు కాపు, శెట్టి బలిజవంటి కులాలు లేవు.  ఒకవేళ ఉన్నా వారంతా స్థానికేతరులేనని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.


హైదరాబాద్‌లో భవన నిర్మాణానికి సంబంధించి సెంట్రింగ్‌ పని చేసే కార్మికుల్లో 75శాతం మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారేనని, వీరిలో కాళింగ, గవర సామాజిక వర్గాలకు చెందినవారు పెద్దసంఖ్యలో ఉన్నారని అంచనా. వీరందరికీ అన్యాయం జరుగుతోంది.ఈ అంశంపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీల నేతలు హమీలుఇస్తూనే ఉంటారు. అయితే ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాలేదు. ఎక్కువ మంది కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో ఉంటారు. అందుకే అక్కడి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..ఉత్తారంధ్ర బీసీ కులాలను మళ్లీ బీసీ జాబితాలో చేర్చే  హామీతోనే టీఆర్ఎస్‌తో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇంత వరకూ ఆ హామీ నెరవేరలేదు. 


గతంలో పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై తాను కేసీఆర్‌తో మాట్లాడతానని ప్రకటించారు. అయితే ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా ఇప్పటి వరకూ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు బీజేపీ నేతలు తెలంగాణ గవర్నర్ కు విజ్ఞప్తి చేయడం ద్వారా మరోసారిఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌కు..  ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అందుకే  ఈ విషయంలో తెలంగాణ గవర్నర్ కూడా చేయగలిగిందేమీ లేదు కానీ.. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు.