సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కున కోల్పోయింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలందించడమే కాకుండా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి ఎంతో కృషి చేశారు ఆయన. అందుకే కృష్ణ పేరు మీద సినీ రంగానికి సేవలందించిన వారికి ప్రతీ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ను ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. 


అయితే  దీనిపై త్వరలో మహేష్ బాబును కూడా కలిసి అవార్డు గురించి చర్చించనున్నామని ఆయన అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఎంపిక ప్రజా బ్యాలెట్ ద్వారా జరుగుతుందని చెప్పారు. ఆ ప్రజా బ్యాలెట్‌ లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిలో విజేతలను జ్యూరీ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పురస్కార వేడుక జరిగే తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. పారదర్శకత కోసం విధి విధానాలపై జ్యూరీ ప్రాథమిక చర్చలు పూర్తి చేసిందని, ప్రతి ఏటా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తెనాలికి సూపర్ స్టార్ చేసిన సేవల్ని, ఆయన జ్ఞాపకాలను మరువలేకే ఈ అవార్డుకు శ్రీకారం చుట్టినట్లు దిలీప్ రాజా తెలిపారు.


సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ ఆయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. ఆయన చేసిన ప్రయోగాలు తెలుగు సినిమా పరిశ్రమ సాంకేతికంగా అభివృద్ధి  కావడానికి ఎంతో ఉపయోగపడ్డారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి.


ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్  లాంటి పురస్కారాలు కృష్ణ‌ను వరించాయి. సినిమాల్లో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినా.. ఆయన తన కన్న వారిని, పెరిగిన ఊరుని మర్చిపోలేదు. ఆయన సినిమాలు విడుదలైన ప్రతీ సారి సొంత ఊరు బుర్రిపాలెం వెళ్లి తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకునేవారు. అందరితో కలిసి సినిమాను చూసేవారు. ఊరి అభివృద్ధికీ ఎంతో కృషి చేశారు. ఇదే స్ఫూర్తితో మహేష్ బాబు ఆ ఊరిని దత్తత తీసుకొని పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.


ఆయన మరణానంతరం సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మహేష్ ఆయన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఏర్పాటు అయితే కృష్ణకు మరో అరుదైన గౌరవం లభించినట్లే. ఈ మెమోరియల్ లో కృష్ణ సినీ జీవితానికి సంబంధించిన అవార్డులు, పురస్కారాలు, ఫోటోలతో పాటు ఆయన జ్ఞాపకాలు వ్యక్తిగత జీవితం విశేషాలు కూడా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మెమోరియల్ ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారట. ఇక ఈ మెమోరియల్ ను త్వరలోనే హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.


Also Read: అలాంటి హీరోయిన్లు నాకు అస్సలు నచ్చరు - రిషబ్ కౌంటర్ రష్మికకేనా?