former Armoor  MLA Jeevan Reddy Case :   ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై కబ్జా కేసు నమోదయింది.  జీవన్ రెడ్డి తో పాటు అతని కుటుంబ సభ్యుల పై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో  దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు  చేశారు. జీవన్ రెడ్డి  తన భూమిని కబ్జా  చేశారని ఆయన ఫిర్యాదు చేశారు.  ఎర్లపల్లి లో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి  కొనుగోలు చేశారు.  సర్వేనెంబర్ 32 35 36 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారు. అయితే  దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి  ఉంది.  2023లో ఫంక్షన్ హాల్ ని కూల్చి వేసి జీవన్ రెడ్డి కబ్జా చేశారని దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.     


పంజాబీ గ్యాంగ్‌ను కాపలాగా పెట్టిన జీవన్ రెడ్డి                            


తన భూమిని కబ్జా చేసి  భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను జీవన్ రెడ్డి పెట్టుకున్నారని..  తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలతీసేందుకు వెళ్లిన  తనపై పంజాబీ గ్యాంగ్ తో దాడి చేయించారని దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  మారణాయుధాలు చూపించి  భయభ్రాంతులకు గురిచేశారన్నారు.  ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు  చేశారు దామోదర్ రెడ్డి.  జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై   447 427 341 386 420 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


నాలుగేళ్ల కిందటే భూమిని కొనుగోలు చేశానంటున్న జీవన్ రెడ్డి 


జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. అయితే ఆ భూమి తనదేనని... తాను నాలుగేళ్ల క్రితం దానిని కొనుగోలు చేశానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఈ భూమి వ్యవహారంలో జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. ఇటీవలే అద్దె బకాయిలు రూ. 2.50కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆయన షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు. షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు ఆర్టీసీ అధికారులు. కోర్టుకు వెళ్లి బకాయిలు తీరుస్తానని హమీ ఇచ్చి .. మాల్ తెరుచుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ మాల్ ను శనివారమే ప్రారంభించారు. అయితే అదే  రోజు ఆయనపై కబ్జా కేసు నమోదు అయింది.              


రెండు సార్లు గెలిచి మూడో సారి మూడో స్థానంలో నిలిచిన జీవన్ రెడ్డి 


ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆర్మూరు నుంచి  రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివాదాస్పదవ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మొదట్లో ఆయన దుబాయ్ బ్యాంకులకు బురిడీ కొట్టించి వచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించేవారు. అయితే వాటిని  జీవన్ రెడ్డి ఖండించారు. రెండు సార్లు భారీ మె జార్టీతో గెలిచిన ఆయన గత ఎన్నిక్లలో మూడో స్థానంతో సరి పెట్టుకున్నారు. ఆర్మూరులో బీజేపీ అభ్యర్థిగా గెలవగా కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు.