Only Sonia is honored On June 2  :  తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా  నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. అప్పటికి కోడ్ అమల్లో ఉంటుంది కనుక ఈసీ అనుమతి తీసుకోనున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ పార్టీ నేతలు అభివర్ణించే సోనియా గాంధీకి కనీవినీ ఎరుగని రీతిలో సన్మానం చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే వేధికపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు కూడా సన్మానం చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన తెలంగాణ పోరాటంలో కీలకంగా  వ్యవహరించడమే కాకండా స్వయం పాలనలో తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయనను కూడా సన్మానిస్తారని.. అధికారికంగా ఆహ్వానం పంపే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అలాంటి ఆలోచనే లేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 


తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి మాత్రమే సన్మానం


తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేదికపై కేసీఆర్‌కు సన్మానం అనే  ప్రశ్నే ఉండదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా గాంధీకే పూర్తి స్థాయి క్రెడిట్ ఉందని కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని గుర్తించే అవకాశం లేదని అంటున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని.. నిఖార్సైన ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గౌరవిస్తుందని తెలంగాణ పేరుతో రాజకీయాలు చేసిన వారి కన్నా.. ఏమి ఆశించకుండా స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారినే కాంగ్రెస్ గుర్తిస్తుందని చెబుతున్నారు. 


ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతకూ ఆహ్వానం                       


అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తన్నారు కాబట్టి ప్రతిపక్ష నేతగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకూ ఆహ్వానం వెళ్లే అవకాశం ఉంది. ఓ అతిథిగా హాజరవ్వాలని ఆయనకు ఇన్విటేషన్ పంపవచ్చు కానీ సన్మానం కోసం కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉండవని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాము ఎంతో కష్టపడి తెచ్చి.. అభివృద్ధి చేసిన తెలంగాణ కాంగ్రెస్ పాలయిందని.. ఇప్పుడు ప్రజలు కష్టాలు పడుతున్నారని.. మళ్లీ తెలంగాణ తమ చేతుల్లోకి వస్తేనే బాగుపడుతుందని బీఆర్ఎస్ నేతలనుకుంటున్నారు. 


కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉండవంటున్న బీఆర్ఎస్                                


అదే సమయంలో  సోనియా, రేవంత్ రెడ్డిలతో కలిసి కేసీఆర్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశాలు ఉండవని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ మాటిచ్చారు. కానీ తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత కేసీఆర్ కుటుంబం అంతా కలిసి సోనియాను కలిసిన తర్వాత మరోసారి కలవలేదు. రేవంత్ తోనూ ఆయన రాజకీయంగా తీవ్రమైన విబేధాలే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కూడా రేవంత్‌కు కేసీఆర్ వైపు నుంచి ఇప్పటి వరకూ శుభాకాంక్షలు కూడా అందలేదు.