BRS MLA Malla  Reddy  will meet CM Revanth Reddy soon :  ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకమాండ్ కు షాక్ ఇస్తున్నారు. తాజాగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( MLA  Mallareddy ) తాను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ భవన్‌లో  మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.  నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముంది అని ఆయన వ్యాఖ్యానించారు.  రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రుడని.. గతంలో ఇద్దరం టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్లమే అని అన్నారు. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తా అని చెప్పుకొచ్చారు.  


బీఆర్ఎస్ ఓడిపోవడం  షాక్ అన్న మల్లారెడ్డి             


తాము ఓడిపోతామని.. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఓడిపోవడం  తమకు షాక్ ఇయితే..  గెలవడం కాంగ్రెస్ కు  షాక్ అన్నారు.   అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో తాము ఇంకా షాక్‌లోనే ఉన్నామని చెప్పారు. ఆ షాక్‌ నుంచి ఒక్కొక్కరం మెల్లగా తేరుకుంటున్నామని అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయడంపైనా  స్పందించారు. కేసీార్  మల్కాజిగిరి ఎంపీగా తననే పోటీ చేయమన్నారని.. కానీ తాను మాత్రం తన కుమారుడు భద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నానన్నారు.  టికెట్ ఎవరికిచ్చినా బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తా అని అన్నారు. 


గతంలో రేవంత్ రెడ్డిపై తొడకొట్టిన మల్లారెడ్డి                              


బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి దూకుడుగా ఉండేవారు. రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసేవారు. తొడకొట్టేవారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన అవన్నీ మర్చిపోయి.. తాము దోస్తులమని చెబుతున్నారు.  మల్లారెడ్డిపై అనేక భూదందాల ఆరోపణలు ఉన్నాయి. పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వైపు నుంచి కక్ష సాధింపులు ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన రేవంత్  రెడ్డికి  అనుకూలంగా మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. 


వరుసగా రేవంత్ తో మర్యాదపూర్వ క భేటీలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు                                                


ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు నిర్వహించడం  వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే సీఎం రేవంత్‌ను కలిశారు.  తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా కలిశారు. అందరిపై పార్టీ మార్పు వార్తలు వచ్చాయి. తాజాగా.. మరో ఎమ్మెల్యే మల్లారెడ్డి కలుస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.