Nirmala Sitharaman Saree Details : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్​కి ఎంత క్రేజ్ ఉందో.. ఆ సమయంలో ఆమె కట్టుకునే శారీలకు అంతే క్రేజ్ ఉంది. ఇప్పటివరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మల.. ఈరోజు మరోసారి (01-02-2024) బడ్జెట్ (Budget 2024 ) ప్రవేశ పెడుతున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఆమె కట్టుకునే చీరలు బడ్జెట్​ను ఏదోరకంగా ప్రతిబింబించేవిగానే ఉన్నాయి. ఈరోజు ఆమె ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కూడా ఆమె ప్రత్యేకమైన చీరనే కట్టుకుని వచ్చారు. 


ఇండిగో బ్లూ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్​లో ఉన్న చీరను నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కట్టుకువచ్చారు. ఈసారి జామ్దానికి చెందిన చీరను కట్టుకువచ్చినట్లు కనిపిస్తుంది. ఈ చేనేత చీరలకు మూడు వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఈ అపురూప కళ బంగ్లాదేశ్​కు చెందినది. ఈ కళలో చీరలపై మొక్కలు, పూలు డిజైన్లు వేస్తారు. వందశాతం పట్టుతో ఈ చీరలను కళాకారులు తయారు చేస్తారు. ఒక్క చీర నేసేందుకు సుమారు 15 రోజులు సమయం పడుతుంది. ఈరోజు నిర్మలా సీతారామన్ కట్టుకువచ్చిన చీరపై ఆకులు, తీగలతో కూడిన డిజైన్ కనిపిస్తుంది.


గతంలో ఇలా..


గత ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్మలా సీతారామన్ ఆకట్టుకునే చీరలు కట్టుకువచ్చారు.  2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెడ్ ప్రవేశ పెట్టారు. అప్పుడు గులాబీ రంగులో బంగారు అంచు ఉన్న మంగళ గిరి చీరను ధరించారు. 2020లో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. పసుపు రంగు సిల్క్ చీరను ధరించి పార్లమెంట్​కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు, బంగారు రంగు చీరను ధరించారు. దీనిలో ఉన్న పసుపు రంగు సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందుకే చాలామంది మహిళలు ప్రత్యేక సందర్భాల్లో పసుపు రంగు చీరలు కట్టుకుంటారు. 


మూడోసారి 2021లో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో తెలంగాణకే తలమానికంగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ చీరను కట్టుకున్నారు. తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీరను తయారు చేశారు. ఎరుపు, హాఫ్ వైట్ సమ్మేళనంతో డిజైన్ చేసిన చీరను ధరించారు. ఈ చీరకు వచ్చిన సన్నని గ్రీన్ బార్డర్​ శారీ అందాన్ని మరింత పెంచింది. 2022లో బడ్జెట్ సమర్పణకు బ్రౌన్ కలర్ చీరను కట్టుకున్నారు సీతారామన్. రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ బార్డర్, సిల్వర్ కలర్ డిజైన్​ వచ్చింది. దీనిని ఓడిశాలో తయారు చేశారు. బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను సూచిస్తుంది. 


2023లో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు బార్డర్ చీరను ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఈ చీరలు కాటన్ లేదా సిల్క్​లో మాత్రమే లభిస్తాయి. 2024లో ఆర్థికమంత్రిగా ఆరవసారి బడ్జెట్​ను ప్రవేశ పెట్టారు నిర్మలా. ఈ సారి ఇండిగో బ్లూ కలర్ చీరలో క్రీమ్ కలర్ కాంబినేషన్​లో ఉన్న చీరను కట్టుకు వచ్చారు. 



Also Read : అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకీ ఆయుష్మాన్ భారత్‌ స్కీమ్ - గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ