Agriculture Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ - 2024 ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ (Agri Credit) లక్ష్యాన్ని రూ.22 - రూ.25 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. అర్హులైన ప్రతి రైతుకూ సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా బడ్జెట్ లో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవసాయ రుణం లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం, ప్రభుత్వం అన్నీ ఆర్థిక సంస్థలకు రూ.3 లక్షల వరకూ స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది. దీని ప్రకారం అన్నదాతలు ఏటా 7 శాతం రాయితీపై రూ.3 లక్షల వరకూ వ్యవసాయ రుణాలు పొందుతున్నారు.


ప్రత్యేక విభాగం


సకాలంలో వడ్డీ చెల్లించే రైతులకు ఏడాదికి 3 శాతం అదనపు వడ్డీని కూడా కేంద్రం అందిస్తోంది. రైతులు దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకోవచ్చు. అయితే, వడ్డీ రేటు మార్కెట్ రేటు ప్రకారం ఉంటుంది. 2024-25 ఆర్థిక ఏడాదికి వ్యవసాయ రుణం లక్ష్యం రూ.22 - రూ.25 లక్షల కోట్లకు పెరగొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బడ్జెట్ లో కేంద్రం అగ్రి - క్రెడిట్ (Agri - Credit)పై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. మిగిలిపోయిన అర్హులైన రైతులను గుర్తించి వారిని క్రెడిట్ నెట్ వర్క్ లోకి తీసుకురావడానికి అనేక ప్రచారాలు నిర్వహిస్తోంది. కేంద్రీకృత విధానంలో భాగంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ 'క్రెడిట్'పై ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించిందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం రుణ పంపిణీ గత పదేళ్లలో లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని పేర్కొంటున్నాయి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2023 నాటికి రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంలో 82 శాతం సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ టైంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా సుమారు రూ.16.37 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ రూ.21.55 లక్షల కోట్లు కాగా, ఇది ఈ కాలానికి నిర్దేశించిన రూ.18.50 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ. కిసాన్ క్రెడిట్ కార్డ్ నెట్ వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాలు పొందారు. 2023, మార్చి 31 వరకూ దాదాపు రూ.8.85 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి.


Also Read: Budget 2024: నిర్మలా సీతారామన్ ఖాతాలో ఎన్నో రికార్డులు సంచలనాలు - అదే ఆమె స్పెషాల్టీ