Budget 2024 Highlights: మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కేంద్రం ప్రవేశ పెడుతున్న పద్దుపై ఎన్నో అంచనాలుండడం సహజం. ఆరోసారి పద్దు ప్రవేశపెడుతూ రికార్డు సృష్టిస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రతిసారీ అంచనాలను అందుకుంటూ బడ్జెట్‌ని రూపొందించడం అంత సులభమేమీ కాదు. కానీ...ఆ సవాలుని ప్రతిసారీ గట్టిగానే ఎదుర్కొన్నారు. అంతే కాదు. ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఆమె పద్దు తయారు చేస్తారన్న పేరునీ సంపాదించుకున్నారు. నిజానికి మోదీ మొదటి సారి ప్రధాని అయ్యాక ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా అరుణ్‌జైట్లీ ఎన్నికయ్యారు. మొదటి సారి ఆయనే పద్దుని ప్రవేశపెట్టారు. ఆ తరవాత ఆయన కన్నుమూశారు. అప్పుడు ఎవరిని ఆర్థిక మంత్రిగా నియమించాలని మేధోమథనం చేసి నిర్మలా సీతారామన్‌కి ఆ అవకాశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏ ప్రభుత్వంలో అయినా సరే...ఆర్థిక శాఖ చాలా కీలకం. అంత ముఖ్యమైన బాధ్యతల్ని ఆమెకి అందించారంటే ఎంత భరోసా ఉండి ఉండాలో అర్థం చేసుకోవచ్చు. 2019లో ఆమె ఆర్థిక మంత్రిగా ఎన్నికైనప్పుడే తొలి రికార్డుని సృష్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆర్థిక మంత్రి పదవికి ఎన్నికైన తొలి మహిళ ఆమే. అలా 2019లో తొలిసారి ఆమె బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. 1970లోనే ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో ఉన్నప్పుడు బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఆ రకంగా చూస్తే పద్దుని ప్రవేశపెట్టిన మహిళ ఆమే అయినప్పటికీ...కేవలం ఆర్థిక మంత్రిగా ఉంటూ పద్దుని రూపొందించిన తొలి మహిళ మాత్రం నిర్మలా సీతారామన్. 



Image Credits: PTI


సుదీర్ఘ ప్రసంగం..


ఆమె ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తన స్పెషాల్టీని చూపించారు. తొలి పద్దులోనే ఆ ప్రత్యేకత చూపించారు. అంతకు ముందు బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేస్‌లో పట్టుకొచ్చే వారు. కానీ...నిర్మలా సీతారామన్‌ వాటిని లెడ్జర్స్‌ రూపంలోకి మార్చారు. ఎర్రని రంగున్న క్లాత్‌లో ఆ లెడ్జర్స్‌ని తీసుకొచ్చే కొత్త సంప్రదాయాన్ని మొదలు పెట్టారు. అలా 2019,2020,2021,2022,2023లో వరుసగా బడ్జెట్‌లు ప్రవేశపెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆరోసారి ప్రవేశపెడుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలుండడం వల్ల మధ్యంతర పద్దుని రూపొందిస్తారు. ఇలా...తొలిసారి మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తొలి మహిళగానూ రికార్డు సృష్టించారు నిర్మలా సీతారామన్. 2020లో అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఆర్థిక మంత్రి హోదాలో  2 గంటల 42 నిముషాల పాటు మాట్లాడారు.