Breaking News Live: ఏపీలో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
చింతామణి నాటక ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయం పట్ల దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలని ఆర్యవైశ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం రామకృష్ణ స్వల్ప లక్షణాలతో హైదరాబాదులోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు (మంగళవారం) సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.
రేపు వరంగర్ లో జిల్లా పరకాల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అకాల వర్షానికి జరిగిన పంట నష్టాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ దృష్టికి జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసి పంటనష్టంపై వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, తానే స్వయంగా పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలిస్తానని హామీఇచ్చారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలున్నాయని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని నారా లోకేష్ సూచించారు.
కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాయనున్న వైద్య విద్యార్థులు 150 మంది విద్యార్థులు పరీక్షలు చేయించుకోగా 50 మందికి పాజిటివ్ అని తేలింది కొందరు విద్యార్థుల ఫలితాలు రావాల్సి ఉంది. రేపటి పరీక్షలు వాయిదా వేయాలని ఎన్టీఆర్ వర్సిటీకి కాలేజీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేగింది. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మరో 10 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడ్డారు. దీంతో వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ పోలీస్ స్టేషన్‌లో సుమారు 70 మంది పనిచేస్తుండగా.. వారం రోజుల వ్యవధిలో 12 మందికి వైరస్ సోకింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
* రాజాం మండలం బొద్ధాం గ్రామంలో రెండు కులాల మధ్య చెలరేగిన వివాదం, తోపులాట
* సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే విషయంలో వివాదం
* పలువురికి గాయాలు రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
* సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామంలో పికిటెంగ్ ఏర్పాటు చేసిన పోలీసులు
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శని, ఆదివారాల్లో భక్తులతో రద్దీగా మారింది. సంక్రాంతి సందర్భంగా శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తల్తెకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Background
ఓమిక్రాన్ అరంగేట్రంతో తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అందులో భాగంగా గతంలో తరహాలో రాత్రి 9 గంటల తర్వాతి నుంచి ఉదయం వరకూ నైట్ కర్ఫ్యూ విధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులను పొడిగించారు. ఈ క్రమంలోనే థియేటర్లు, షాపింగ్ మాల్స్ సహా జనాలు అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయాలని భావిస్తున్నారు. నేడు (జనవరి 17) మధ్యా్హ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశం ఉన్నందున రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది.
ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ పోచారం సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రోజువారీ కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నియంత్రణ కోసం చర్యలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, కరోనా పరీక్షలు మరింత సంఖ్యలో చేయడం, వ్యాక్సిన్‌లు ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పర్చడం వంటి చర్యలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అనాథల సంక్షేమం, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు కరవుభత్యం, దళితబంధుకు నిధుల మంజూరు, వంటి అంశాలు అజెండాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
పొట్టేలు తల నరకబోయి మనిషి తల నరికి..
మదనపల్లె రూరల్ మండలం వలసపల్లెలో స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద మద్యం మత్తులో ఉన్న తలారి.. పొట్టేలు అనుకుని ఓ వ్యక్తి తల నరికేశాడు. అక్కడ జరిగింది చూసిన వారు ఒక్కసారిగా షాకయ్యారు. పొలిమేరలో గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు పొట్టేలును తీసుకొచ్చారు. తలారి లక్ష్మణ్ కుమారుడు తలారి సురేష్(35) పొట్టేలును పట్టుకుని నిల్చున్నాడు. మరో తలారి చలపతి అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. బలిచ్చే సమయం కాగా, అంతా ఒకే అన్నారు. కానీ మద్యం మత్తులో ఉన్న తలారి చలపతి పొట్టేలు తలకు బదులుగా తలారి సురేష్ తలపై కత్తితో వేటు వేశాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడ్ని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు చలపతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులో ఉండటం వల్లే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -