Breaking News Live:హన్మకొండలో రోడ్డు ప్రమాదం...బైక్ ను ఢీకొన్న కారు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
హన్మకొండ జిల్లా బాలసముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. బస్టాండ్ నుంచి సుబేదారి వైపు వెళ్తున్న కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతు అయ్యారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు నదిలో గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మంగళగిరిలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. అధికార పార్టీ ఎంపీ అనుచరులమంటూ అరుపులు కేకలతో అలజడి సృష్టించారు. ఆటోనగర్ లోని టీ స్టాల్, కార్ వాషింగ్ పాయింట్ వద్ద ఇద్దరు యువకులపై 20 మంది విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారితో రాజీచేసేందుకు అధికార పార్టీకి చెందిన నాయకులు రంగంలోకి దిగారు. ఘర్షణకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని చెప్పారు. జిల్లాలో దాదాపు 99 శాతం ఓటింగ్ జరుగుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, మరో ప్రజప్రతినిధిని ఎన్నుకునే ఈ ఎన్నికల్లో విధిగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
మాజీ మంత్రి కళ్లెదుటే టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు వచ్చాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో నియోజకవర్గంలోని పంచాయతీలకు దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి హాజరయ్యారు. సభ ప్రారంభం అయ్యే ముందే ఎమ్మెల్యే వర్గీయులు ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ ప్రతిసారి వివిధ కార్యక్రమాల్లో ఈ విధంగానే జరుగుతుందని మాజీ మంత్రి ముందే ఇరువర్గాల వారు వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి కోపం వచ్చింది. అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పై ఆ గ్రహానికి చంద్రయ్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.
ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు కూర్చొని నిరసన తెలిపారు. టీఆర్ఎస్ నేతలు కేంద్రంలో తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. దీంతో పోలీసులు - కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్తత జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సిరిసిల్ల నియోజకవర్గ మంత్రి కేటీఆర్ హాజరై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రితో పాటు పది రోజుల క్రితం క్యాంపుకు వెళ్లిన సిరిసిల్ల పట్టణ కౌన్సిలర్లు మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు కూడా బస్సులలో నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటును వినియోగించుకున్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు 201 ఓటర్లు ఉన్నారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో నివారణ చర్యలు కచ్చితంగా పాటించేలా పర్యవేక్షిస్తున్నారు.
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 768 ఓటర్ల ఉండగా 4 పొలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం,కల్లురు లో పొలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పొలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓటర్లను ఎవరికి వారే కేంద్రాల్లో తీసుకొస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు కేవలం ఏడు శాతం పోలింగ్ నమోదయిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస సమీపంలో పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు కాగా, 10 మందిని గజపతినగరం పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 12 మందిని విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. విజయనగరం తరలించిన వారిలో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలిస్తున్నారు. వీరంతా బొండపల్లి మండంలం కిండాం అగ్రహారంలో పెళ్లికి హాజరై.. తిరుగు ప్రయాణంలో మెంటాడ మండలం చింతాడవలస వెళతున్నారు. మార్గం మధ్యలో చామలవలస సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది.
తిరుపతి : రెండు ఇన్నోవా వాహనాలతో సహా 16 ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పీలేరు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పీలేరులో పోలీసుల తనిఖీల్లో స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్స్ లో చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, కృష్ణయ్య ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడడంతో విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 12 మంది ఆర్మీ ఉన్నతాధికారుల్లో ఒకరి అంత్యక్రియలు ముగిశాయి. బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ అంత్యక్రియలను ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక లాంఛనాలతో చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య, కుమార్తె కన్నీటిపర్యంతమయ్యారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అజ్ఞాత భక్తుడు భారీగా బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు.. దాదాపుగా రూ.3.50 కోట్ల విలువ చేసే 5.5 కిలోల స్వర్ణ కటి, వరద హస్తాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామి వారికి కానుకగా అందించారు.. స్వర్ణ కటి, వరద హస్తాలను మూలమూర్తికి ఆలయ అర్చకులు అలంకరించనున్నారు.
రాజేంద్రనగర్‌లో అనుమానంతో భార్యను భర్త హత్యచేశాడు. భార్యపై అనుమానం పెంచుకున్న పర్వేజ్ తరచూ గొడవపడుతూ ఉండేవాడు. గతంలో విడాకులు కూడా తీసుకున్నారు. ఏడాది క్రితం సమ్రిన్‌కు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, గురువారం రాత్రి ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సమ్రిన్ మెడపై కోసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Background
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. నేడు జరుగుతున్న ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకుగానూ మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి స్థానిక సంస్థల కోటాలో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణను వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా.. డిసెంబర్ 14న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమదే విజయమని అధికార టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఒక్క కరీంనగర్ జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ నేతలలో కొంత అమోమయం నెలకొంది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడం ఓట్ల చీలికకు దారి తీస్తుందని జిల్లా నేతలు భావిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకుగాను 8 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. కరీంనగర్, హుజురాబాద్ జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిద్ధిపేట, హుస్నాబాద్ లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 1324 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎల్. రమణ, టి.భానుప్రసాద్ రావు పోటీలో ఉండగా, ఇండిపెండెంట్ గా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు.
Also Read: CDS Bipin Rawat Cremation: బిపిన్ రావత్ పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు.. నేడు అంత్యక్రియలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ వివరించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో 84 మంది, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 221 మంది, కల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 115 మంది, ఖమ్మం రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 314 మంది పురుషులు, 454 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -