Telangana Assembly Komatireddy Rajagopal Reddy : తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి పదవి, లోక్ సభ ఎన్నికల్లో పోటీ అంశానికి సంబంధించి కేటీఆర్… రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే తనను వివాదంలోకి లాగవద్దని సరదాగా వ్యాఖ్యానిస్తూ కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్‌కు కోమటిరెడ్డి ఎదురయ్యారు. ఈ సమయంలో… మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి కోమటిరెడ్డి… మీలాగే నాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని సమాధానం ఇచ్చారు.
దీంతో కేటీఆర్… ఫ్యామిలీ పాలన కాదు… మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయన్నారు. తనకు హోం శాఖ మంత్రి పదవి ఇస్తానంటూ అధిష్టానం హామీ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారాయన. తనకు హోం శాఖ ఇస్తే.. బీఆర్ఎస్ వాళ్లు కంట్రోల్ ఉంటారంటూ చెప్పుకొచ్చారాయన. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన అంశంపై అడిగారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా? సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ అడిగారు. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు మా కుటుంబ సభ్యులు నుంచి ఎవరూ పోటీ చేయటం లేదని వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేస్తామని.. సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని రాజ గోపాల్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడారు.
కేసీఆర్ ని గద్దె దించేందుకే కాంగ్రెస్ లోకి వచ్చానని స్పష్టం చేశారాయన. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని.. కేసీఆర్ కు బీజేపీయే శ్రీ రామరక్ష అంటూ జోస్యం చెప్పారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు అవినీతి చేసిన అందరూ జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కీలకమైన శాఖ కావడంతో రేవంత్ రెడ్డి తనతోనే అట్టిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి ఏకంగా హోంశాఖకే ఎసరు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా?. ఆయన కోరుకున్నట్లుగానే హోంశాఖను కేటాయిస్తారా?. అందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
త్వరలోనే BRSను బీజేపీలో విలీనం చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌రెడ్డి. కేసీఆరే దగ్గరుండి BRS ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని జోష్యం చెప్పారు. కేసీఆర్‌కు బీజేపీనే శ్రీరామరక్ష అన్నారు. వాళ్లను వాళ్లు కాపాడుకోవడానికి BRS ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారన్నారు రాజగోపాల్‌రెడ్డి. భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌కు కుటుంబ సభ్యులెవ్వరూ పోటీ చేయకూడదు అనేది తమ ఉద్దేశం అన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తం లేదంటే లేదు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామన్నారు రాజగోపాల్‌రెడ్డి.