తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మనం ఇక్కడ నినదిస్తే హైదరాబాద్‌లో ఉన్న కేసీఆర్‌కు వినపడాలని అన్నారు.


గత పదేళ్లుగా కేసీఆర్ తన కుటుంబం కోసమే పని చేశారని అమిత్ షా అన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశామని కేసీఆర్ చెబుతుంటారని, రైతుల ఆత్మహత్యల విషయంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా కేసీఆర్ చేశారని అన్నారు. అవినీతి విషయంలోనూ నెంబర్ 1గా చేశారని అన్నారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు కానీ, ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని ఎద్దేవా చేశారు. మజ్లిస్ కనుసన్నుల్లో నడిచే బీఆర్ఎస్ ను పీకి పారేసి మోదీ నేతృత్వంలోని బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.


‘‘మోదీ సర్కారు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి శత్రువులను తరిమి కొట్టింది. అదేవిధంగా మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించింది. ప్రతి పేద మహిళకు మోదీ గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దళితులు, గిరిజనుల కోసం మోదీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేలు వేస్తున్నాం. ఒడిశాలో పుట్టి పెరిగిన పేద గిరిజన మహిళను మోదీ రాష్ట్రపతిని చేశారు’’ అని అమిత్ షా అన్నారు.


తెలంగాణలో ట్రైబల్ వర్సిటీకి బీఆర్ఎస్ సర్కార్ సహకరించలేదని అమిత్ షా తెలిపారు. గిరిజన వర్సిటీకి కేసీఆర్‌ సర్కారు జాగా చూపించలేదని..  ఆందుకే ఆలస్యమైందని చెప్పారు. పసుపు బోర్డు, కృష్ణ ట్రిబ్యునల్ మోదీ ఘనతేనని చెప్పారు. ఎన్నికల హామీలను కేసీఆర్ విస్మరించాడని అమిత్ షా ఆరోపించారు. కేవలం కేటీఆర్ ను ఎలా  సీఎంను చేయాలనే కేసీఆర్ పదేళ్లుగా ఆలోచిస్తున్నారని అన్నారు.






కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నించిన సీసీఐ సాధన సమితి


అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ చౌరస్తా వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నించారు సీసీఐ సాధన సమితి నాయకులు. నల్లబెలూన్లు పట్టుకొని ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కాన్వాయ్ లో గాలిలోకి నల్ల బెలూన్లు వదిలారు. అమిత్ షా కాన్వాయ్ ని అడ్డుకునేందుకు యత్నించిన సీసీఐ సాధన సమితి నాయకులను పోలీసులు అడ్డుకొని పక్కకు తీసుకెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ పునరుద్ధరణను గురించి కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని, సీసీఐ పునరుద్దరణకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.