కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి మించి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు కోరుకుంటే ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం నామినేషన్ల దాఖలు ప్రారంభానికి 5 రోజుల ముందుగానే ఎన్నికల అధికారులకు 12డీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి అర్హులందరి ఇళ్లకు వెళ్లి ఆసక్తి చూపితే 12డీ దరఖాస్తు చేయిస్తారని స్పష్టం చేసింది. 


ఓటింగ్ ఎలా అంటే.?


ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగం కోసం నమోదైన దరఖాస్తులను, నియోజకవర్గ అధికారి ఆమోద ముద్రతో పోస్టల్ బ్యాలెట్ ముద్రణనుఎన్నికల సంఘానికి పంపుతారు. పోలింగ్ తేదీ కన్నా ముందే, పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి బ్యాలెట్ పత్రాలు, సంబంధిత కవర్లతో ఓటర్ల ఇంటికి వెళ్తారు. అక్కడ ఓటరు రహస్యంగా తన ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక కంపార్టుమెంట్ ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో పార్టీలు, అభ్యర్థుల ప్రతినిధులు అక్కడికి హాజరయ్యేందుకు ఈసీ అనుమతించింది. అయితే, ఒకసారి బ్యాలెట్ కు అనుమతి పొందిన వారు, పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం ఉండదని ఈసీ స్పష్టం చేసింది. ఓటింగ్ పూర్తయ్యాక  ఆయా కవర్లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి, పోస్టల్ ఓట్లతో కలిపి లెక్కిస్తారు.


ఎంతమంది వృద్ధులంటే.?


ఈసీ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులు 4.43 లక్షల మంది ఉన్నారు. వారిలో వందేళ్లు దాటిన వారు 7,689 మంది ఉన్నారు. కాగా, దివ్యాంగ ఓటర్లు మరో 5.06 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో మునుగోడు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల అధికారులు అమలు చేశారు.


ముందుగానే సమాచారం


ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలు, నియోజకవర్గ అభ్యర్థులకు ముందుగానే ఎన్నికల అధికారులు అందజేస్తారు. పార్టీల, అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలోనే ఈ ప్రక్రియ జరగనుండగా, ఈ తతంగాన్ని వీడియో తీస్తారు. 


ముఖ్యమైన తేదీలివే


తెలంగాణలో ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీ. నవంబర్ 13న నామినేషన్ల స్క్రూటినీ, నామినేషన్ల విత్ డ్రాకు నవంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.


5 రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడంటే.?


నవంబర్ 7న మిజోరం, ఛత్తీస్ గడ్ మొదటి దశ, నవంబర్ 17న ఛత్తీస్ గడ్ రెండో దశ , మధ్యప్రదేశ్ ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే, రాజస్థాన్ లో నవంబర్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల జరగనుండగా, అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లెక్కింపు డిసెంబర్ 3నే జరగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.