BJP Preparations :  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amith Shah )  తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28వ తేదీన షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy ) తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్‌ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మండలాల అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 8 మంది గెలుపొందారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ ( Eatala Rajendar ), ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు సహా కీలక నేతలంతా ఓటమి చెందారు. దీంతో లోక్‌సభ ఎన్నికలపై పార్టీ సీనియర్లకు షా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.             


సీనియర్లు ఓడినా బీజేపీకి మంచి ఫలితాలే                


తెలంగాణలో సీనియర్ నేతలు ఓడిపోయినప్పటికీ..మంచి  ఓటు పర్సంటేజీ వచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. 8 స్థానాల్లో గెలవడమే కాకుండా మరో 18 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ బాగా బలపడుతోందని  హైకమాండ్ అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో పార్టీ నేతకు దిశానిర్దేశం చేయాలని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నేతలు వర్గ పోరాటానికి దిగడంతో పార్టీ ఎక్కువగా నష్టపోయింది. సీనియర్లు అందరూ ఓడిపోవడానికి వర్గ పోరాటమే కారణమని భావిస్తున్నారు.             


సీనియర్లు వర్గ పోరాటం తగ్గించుకోవాలని షా వార్నింగ్ ఇచ్చే చాన్స్                          


ఈ క్రమంలో అందరి నేతల మధ్య సమన్వయం కోసం..  అమిత్ షా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్లతో పాటు కొంత మంది ప్రముఖ  వ్యక్తుల్ని  కీలక నియోజకవర్గాల్లో పోటీకి పెట్టే అవకాశాలపై ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సీనియర్లను పార్లమెంట్  బరిలోకి దింపేందుకు హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎంపీలు సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎక్కువ ఫలితాలు సాధించిన చోట.. గ్రేటర్ పరిధిలో ప్రత్యేకమైన దృష్టి సారించాలని  ..  బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.                   


10 లోక్‌సభ సీట్లపై బీజేపీ గురి                                     


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం..  బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో ఓ వార్ రూం సిద్ధం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వార్ రూం పని చేసే ్అవకాశాలు ఉన్నాయి.  అక్కడి నుంచి వచ్చే సూచనలు, సలహాలు ఆధారంగా పని చేసే అవకాశాలు  ఉన్నాయి. కనీసం పది నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా ప్రయత్నించాలని ఇప్పటికే  దిశానిర్దేశం చేశారు. .