Allu Arjun Spend In Jail Whole Night: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను (Allu Arjun) పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలసిందే. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తొలుత శుక్రవారం రాత్రే ఆయన విడుదల అవుతారని అంతా భావించారు. అయితే, జైలు అధికారులకు బెయిల్ పత్రాలు రాత్రి 10:30 గంటలకు అందడంతో ఆయన్ను రాత్రంతా జైల్లోనే ఉంచారు. ఖైదీలందరూ బ్యారక్‌కు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్‌ క్లాస్ - 1 రూంలో ఉంచారు. జైలు అధికారులు ఫుడ్ ఇచ్చినా బన్నీ తీసుకోలేదని తెలుస్తోంది. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీదే పడుకున్నట్లు సమాచారం. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన్ను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. ఈ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. అయితే, బన్నీ రాత్రి విడుదల కాకపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. అల్లు అరవింద్ తీవ్ర అసహనంతో సొంత కారు వదిలి క్యాబ్‌లో వెళ్లిపోయారు. 


ఇదీ జరిగింది


హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులోనే శుక్రవారం బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, భజన్‌లాల్ కేసులను ప్రస్తావిస్తూ బెయిల్ ఇస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఈ క్రమంలో ఆయన శుక్రవారమే విడుదలవుతారని అంతా భావించారు. అయినా, జాప్యం కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 


Also Read: Allu Arjun News: అల్లు అర్జున్ భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదు, ఆయనే వచ్చి పోలీసు వాహనం ఎక్కారు: సెంట్రల్ జోన్ డీసీపీ